Mallaiah Excels in Painting: ఓ పేపర్, పెన్సిల్ ఇస్తే చాలు. చూపించిన చిత్రాన్ని అంతే సహజంగా గీయగలడు ఈ యువకుడు. పాఠశాల రోజుల నుంచే ఆర్ట్‌పై మక్కువ పెంచుకుని అదిరిపోయే చిత్రాలు గీస్తున్నాడు. చిత్రకళపై ఆసక్తితో బీఎఫ్ఏ కోర్సు పూర్తి చేసి కెరీర్‌కు బాటలు వెసుకున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ ప్రథమ స్థానంలో నిలుస్తోన్నాడు ఈ యువ చిత్రకారుడు.
పోట్రెయిట్ బొమ్మలను కంప్యూటర్‌లో డిజైన్ తీసినట్లు పెన్ను, పెన్సిల్‌తో వేసిన ఈ కుర్రాడు గంప మల్లయ్య. కడప శివారు ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో ఆర్ట్స్ అండ్ క్రాప్ట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అనంతపురం జిల్లా సొరకాయలపేట స్వస్థలం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కొనసాగించాడు మల్లయ్య.
చిన్నప్పటి నుంచి బొమ్మలేయడం మల్లయ్యకు చాలా ఆసక్తి. కానీ ప్రోత్సహించేవారు లేక ఎలా వెళ్లాలో తెలియక తికమక పడ్డాడు. తర్వాత ఎంఎస్సీ చేయాలని ఎస్కే యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకున్నాడు. చివరకు స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో యోగి వేమన యూనివర్సిటీ ఆర్స్ట్ కోర్సు చేసేందుకు మక్కువ చూపాడు. ఇంతకు ముందే బీఎస్సీ పూర్తి చేసి ఉన్నా ఆసక్తితో మరోడిగ్రీగా బీఎఫ్ఏ కోర్సులో చేరాడు.
బొమ్మలు గీయడమంటే ఇష్టం - లైవ్ పెయింటింగ్‌తో అదరగొడుతున్న ధనుష్య - Live Painter From Vijayawada
నాలుగేళ్ల బీఎఫ్ఏ కోర్సులో లలితకళల విభాగంలో మెళకువలు నేర్చుకున్నాడు మల్లయ్య. యూనివర్సిటీలో ఆర్ట్స్‌పై పట్టుసాధిస్తూనే రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాడు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇండియన్ సౌత్‌జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. తెలుగు గిరిజన జీవన విధానంపై అద్భుతచిత్రం గీసి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నాడు. అదే పోటీలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
సౌత్‌జోన్‌లో సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు మల్లయ్య. అక్కడ అదే ప్రతిభ, నైపుణ్యాలు ప్రదర్శించి బంగారు పతకం అందుకున్నాడు. జాతీయస్థాయి రంగోలి విభాగంలో రాయలసీమ సంస్కృతి ప్రతిబింబించేలా వేసిన వర్ణచిత్రానికి మొదటి బహుమతి సాధించాడు. జాతీయ స్థాయి క్లే పెయింటింగ్ పోటీల్లోనూ ప్రథమ స్థాయిలో రాణించి ఔరా అనిపించాడు మల్లయ్య.
పెయింటింగ్, కాన్వాస్ పెయింటింగ్, క్లే పెయింటింగ్, పోట్రెయిట్ డ్రాయింగ్, డిజైనింగ్, స్క్రిబ్లింగ్ ఆర్ట్, పెన్సిల్ డ్రాయింగ్ ఇలా ఏ కళలో అయినా నేర్పుగా వేయడంలో దిట్టయ్యాడు మల్లయ్య. చిత్రం వేస్తే శారీరాకృతులతో పాటు ముఖ కవలికలు అచ్చం అలాగే ఉంటాయి. అందుకే దేశంలో ఎక్కడ పోటీలు జరిగిన ప్రథమస్థానంలో ఉంటున్నాడు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కెరీర్ దృష్ట్యా ఓ ప్రైవేట్ స్కూల్‌లో డ్రాయింగ్ మాస్టర్‌గా చేరాడు. తద్వారా తల్లిదండ్రులకు అండగా ఉంటూనే పిల్లలకు డ్రాయింగ్ నేర్పుతున్నాడు. మొదట ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తుంటే చాలా మంది చిన్నచూపు చూశారని అంటున్నాడు మల్లయ్య. కానీ, నేడు ఈ విధంగా అవార్డులు తెస్తుంటే విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారని గర్వంగా చెబుతున్నాడు. ఇక్కడితో ఆగిపోకుండా తన ప్రతిభకు సానపెట్టి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుతానని ధీమాగా చెబుతున్నాడీ చిత్రకారుడు.
కరాటేలో బెజవాడ కుర్రాడి సత్తా - అంతర్జాతీయంగా 6 స్వర్ణ పతకాలు కైవసం - Ranadhir Excelling in Karate