Justice PC Ghose Commission on Medigadda Barrage : మేడిగడ్డ ఆనకట్టపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికి రెండు దఫాలుగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన జస్టిస్ ఘోష్ నీటిపారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలతో విస్తృతంగా చర్చించారు. మేడిగడ్డ ఆనకట్టను క్షేత్రస్థాయిలో పరిశీలించి బ్యారేజీ విషయమై స్వయంగా ఓ అవగాహనకు వచ్చారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో రామగుండం ఈఎన్సీగా పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లును విచారణ ప్రక్రియలో భాగంగా పిలిపించి అవసరమైన సమాచారం తీసుకున్నారు.
అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని వెంకటేశ్వర్లును ఆదేశించారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో ఈఎన్సీ జనరల్‌గా పనిచేసిన మురళీధర్‌ను సైతం విచారణకు పిలిచినట్లు సమాచారం. జస్టిస్ పీసీ ఘోష్ తదుపరి పర్యటనలో మరికొంత మందిని విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా పలువురికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
Justice PC Ghose Commission Investigation on Medigadda Barrage : ఆనకట్ట నిర్మాణ సమయంలో పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించిన వివిధ స్థాయిల్లోని ఇంజినీర్లను విచారణకు పిలువనున్నారు. వీరితో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులకూ సమన్లు జారీ చేసి విచారణ చేయనున్నారు. ఆనకట్టకు తదుపరి నష్టం జరగకుండా వర్షాకాలం లోపు చేయాల్సిన మరమ్మత్తులపైనా కమిషన్ దృష్టి సారించింది. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించారు. వర్షాకాలం లోపు చేయాల్సిన పనులకు సంబంధించి ఎన్డీఎస్‌ఏ కమిటీ పలు సూచనలు చేసింది. వాటి ఆధారంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ రాష్ట్ర నీటిపారుదల శాఖను ఆదేశించింది.
కమిషన్ ఆదేశాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీలు చర్చించారు. ఎన్డీఎస్‌ఏ కమిటీ చేసిన సూచనలు, వాటి అమలు విషయమై తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నీటిపారుదల శాఖ తదుపరి చర్యలు చేపట్టనుంది. ముఖ్యమంత్రి, మంత్రి ఆమోదం అనంతరం ఈ పనులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.