Justice Narasimha Reddy Commission : బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గడ్‌తో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాల అవకతవకలపై రాష్ట్రప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ బీఆర్కే భవన్‌లో విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌లు జస్టిస్ నరసింహారెడ్డిని కలిసి పలు అంశాలపై వివరాలు అందజేశారు.
అదనపు భారం.. గత ప్రభుత్వం 2014లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోళ్లు చేసుకుందనీ, అప్పటికే సింగరేణి, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని విద్యుత్ రంగ నిపుణుడు తిమ్మారెడ్డి తెలిపారు. ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ సరఫరా 80 శాతం కూడా చేయలేదని ఆరోపించారు. తద్వారా అదనపు విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని తద్వారా రూ.630 కోట్ల అదనపు భారం పడింది అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
ఉపయోగం లేదు.. ఛత్తీస్‌గడ్ విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. భద్రాద్రి విద్యుత్ నిర్మాణ వ్యయం 40 శాతం అధికం అయ్యిందన్నారు. ఛత్తీస్‌గడ్ విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు కాంపిటీట్ విధానంలో వెళ్లకపోవడం వల్ల అధిక నష్టం వాటిల్లింది అని విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాల్ ఆరోపించారు. తద్వారా అదనంగా వందల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. మిగిలిన బకాయిల చెల్లించాలంటూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఒత్తిడి చేస్తోందని తెలిపారు.
"గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో 1000మెగావాట్ల పవర్‌ను కొనడానికి ఒప్పందం చేసుకుంది. కానీ ఆ మొత్తాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల రూ. 630కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ ప్రజల మీద పడింది. ఛత్తీస్‌గఢ్‌తో కొన్న విద్యుత్ ఖర్చు కూడా రూ.5.45పైసల వరకు పెరిగింది. బయట మార్కెట్‌తో పోలిస్తే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఆర్ధికంగా నష్టం కలిగింది". - తిమ్మారెడ్డి : విద్యుత్ రంగ నిపుణుడు
"ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు. విద్యుత్ కొనుగోలు చేసేందుకు కాంపిటీట్ విధానంలో వెళ్లకపోవడం వల్ల అధిక నష్టం వాటిల్లింది. ఎక్కువధరకు విద్యుత్‌ను కొనుగోలు చేశారు" - వేణుగోపాల్, విద్యుత్ రంగ నిపుణుడు