Amaravati Cleaning Works: తెలుగుదేశం విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకుంటోంది. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లుగా పాడుబడిన రాజధాని ప్రాంతం మళ్లీ కళ సంతరించుకుంటోంది. జంగిల్ క్లియరెన్స్ జోరుగా సాగుతుండగా ఆ తర్వాత రాజధానిలో రహదారులు బాగు చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతికి పూర్వవైభవం దిశగా అడుగులు పడుతున్నాయని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ప్రజా రాజధాని అమరావతిలో పనులు పరుగులు పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచే మొదలైన పనులు జోరుగాసాగుతున్నాయి.! పదులసంఖ్యలో ప్రొక్లెయిన్లు రాజధాని రోడ్ల వెంట ఉన్న కంపచెట్లు, పిచ్చిమొక్కలను తొలగిస్తున్నాయి.! ప్రభుత్వ భవనాల చుట్టూ చిట్టడవిలా పేరుకుపోయిన కంపచెట్లను సీఆర్‌డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. సీఆర్డీఏ అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పిచ్చి కంప తొలగించిన అనంతరం రోడ్ల పనులు ప్రారంభిస్తామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారించామన్నారు. 90 శాతం పైగా పూర్తైన భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో 75 వేల మందికి తాగునీరు అందించే ట్యాంకులను జులై చివరికల్లా అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అందులో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేస్తామని వివేక్ యాదవ్ చెప్పారు.
ఐదేళ్లుగా తాము అనుభవిస్తున్న నరకయాతనకు విముక్తి లభించిందని అమరావతి రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. విధ్వంసకారుడికి, విజనరీకి ఉన్న తేడా ఏంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ముఖ‌్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం ఈనెల 13న చంద్రబాబు అమరావతిలో పర్యటించి పెండింగ్ పనులపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
"పిచ్చి కంప తొలగించిన అనంతరం రోడ్ల పనలు ప్రారంభిస్తాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారించాం. 90 శాతం పైగా పూర్తైన భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రాజధాని ప్రాంతంలో 75 వేల మందికి తాగునీరు అందించే ట్యాంకులను జులై చివరికల్లా అందుబాటులోకి తెస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అందులో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేస్తాం." - వివేక్ యాదవ్, సీఆర్డీఏ కమిషనర్