JC Visited Visakha Red Clay Dunes: విశాఖ ఎర్రమట్టి దిబ్బల వద్ద ఎటువంటి తవ్వకాలు జరపకుండా చూసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ వెల్లడించారు. భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఉన్నతాధికారులు స్పందించారు. భారీ యంత్రాలతో పనులు జరుగుతున్న ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్ మయూర్, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పరిశీలించారు. భారీగా జేసీబీలతో పని చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై జేసీ మయూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఉదయం తమకు తెలిసిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ వాళ్లు పనులు ఆపేసారంటూ జేసీకి కిందిస్థాయి రెవెన్యూ అధికారులు తప్పుడు వివరణ ఇవ్వబోయారు. నిన్న సాయంత్రం వరకు భారీ యంత్రాలతో తవ్వకాలు జరిగినట్లుగా మీడియా చిత్రించిన విజువల్స్‌లో స్పష్టంగా కనిపించినా ఈ వివరణ ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం జేసీని విస్మయపరిచింది. అధికారుల రాక తెలుసుకుని నిర్వాహకులు అంతకుముందే యంత్రాలు, లారీలను అక్కడి నుంచి పంపించేశారు. తనిఖీ సమయంలో క్షేత్రస్థాయి అధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది.
మంగళవారం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వచ్చేసరికి జేసీబీలు ఉంటే ఎందుకు సీజ్ చేయలేదని జిల్లా జేసీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జియో హెరిటేజ్ సైట్ దాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన దీనిపై సమగ్ర నివేదిక కలెక్టర్‌కు అందిస్తానని చెప్పారు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని జాయింట్ కలెక్టర్ మయూర్ స్పష్టం చేశారు.
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై ఆందోళన: విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాలని పర్యావరణ వేత్తలు, స్థానికులు గళమెత్తారు. పర్యావరణానికి విధ్వంసం కలిగేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకుని ఇక్కడ పర్యావరణ పరిరక్షణ, పర్యాటక ఆకర్షణకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై స్పందించిన సీఎంవో: ఇదిలా ఉండగా విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. జిల్లా అధికారులతో మాట్లాడి తవ్వకాలు నిలుపుదలకు చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి భౌగోళిక వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై జిల్లా అధికారులతో సీఎంవో అధికారులు మాట్లాడి పలు అంశాలను చర్చించారు. పర్యావరణానికి హాని చేసే చర్యలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
విశాఖ జిల్లాలో 'అవినీతి ముత్యం' - కనుమరుగవుతున్న ఎర్రమట్టి దిబ్బలు! - YSRCP Leaders Irregularities