Job Get Easily With Special Skills: ఈ పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఈ రోజుల్లో ఉద్యోగం కావాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు. ఎన్నో టెక్నికల్ స్కిల్స్ కావాలి. అంతేకాదు వీటికితోడు కొన్ని వ్యక్తిగతమైన నైపుణ్యాలు ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న అభ్యర్థుల పట్ల కంపెనీలు ఇంటర్వ్యూ సమయంలో ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈజీగా ఉద్యోగం పొందే అలాంటి స్కిల్స్ మీలో ఉన్నాయా? చెక్ చేసుకోండి!
కొత్త విషయాలపై ఆసక్తి : ఉన్నత చదువులు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేస్తుందనుకునే రోజులు లేవు. ప్రత్యేకమైన స్కిల్స్ లేకపోతే సంవత్సరాల పాటు చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే నిలదొక్కుకోగలం. అందుకు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. అప్పుడే కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలుంటాయి.
నేర్చుకోవాలనే ఉత్సాహం ఉందా ?: ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఇంట్రస్ట్ ఉండాలి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, విభిన్నంగా ఆలోచించాలి. అలాంటి స్కిల్స్ ఉన్న వారికే జాబ్స్ ఇచ్చేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అలాంటి వారికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూ సమయంలో మీలో ఉన్న ఈ స్కిల్స్‌ను ఉదాహరణలతో సహా చెప్పేలా చూడండి.
సాధించాలనే కసి మీ సొంతమా: జీవితం, కెరీర్‌లో ఎదగాలనే కోరిక ఉంటేనే సరిపోదు, అందుకు కసి కావాలి. నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. ఇందుకోసం చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని అధిగమించే నేచర్‌ను అలవాటు చేసుకోవాలి. కెరీర్‌లో ఎదగాలనే కోరికతో పాటు పట్టుదల, ఓపిక, పోటీతత్వం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే గుణాన్ని పెంపొందించుకోవాలి.
లీడర్షిప్ క్యాలిటీ ఉందా? : జీవితంలో సక్సెస్ సాధించాలని అందరూ అనుకుంటారు. కానీ, కొందరు మాత్రమే ఆ కలలను నిజం చేసుకోగలుగుతారు. మీ అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించకపోతే వారిపై కోపం పెంచుకుంటే జీవితంలో ఏమీ సాధించలేరు. అంతేకాదు మీ టీమ్‌ను ముందుకు తీసుకెళ్లలేరు. కాబట్టి అందరితో కలిసిపోయి పనిచేసే అలవాటు చేసుకుంటే టీమ్ లీడర్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.
భిన్నంగా ఆలోచిస్తున్నారా ?: ఏ విషయాన్నయినా సరే భిన్నంగా ఆలోచించాలి. పాత కాలం మాదిరిగా మొండిగా వ్యవహరిస్తే కెరీర్‌లో రాణించలేరు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కేవలం మీ దృష్టితోనే కాకుండా అవతలి వారి యాంగిల్లోనూ ఆలోచించే పద్ధతి అలవర్చుకోవాలి. అప్పుడే, సమస్య పరిష్కరించే నైపుణ్యం మీకు అలవడుతుంది.
ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు జాబ్ సంపాదించడమే కాదు కెరీర్‌లో ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకోగలరని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.