Jasmine Farmers Suffering: మల్లె రైతుకు మార్కెట్ కలిసి రావడం లేదు. దిగుబడి తగ్గినప్పుడు ధర పలికే పూలు. దిగుబడి పెరిగితే ఒక్కసారిగా ధర పతనమవుతోంది. విధిలేని పరిస్థితుల్లో రైతులు పూలను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పూలసాగును రైతులు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రధానంగా చండ్రగూడెం గ్రామం పూలసాగుకు పెట్టింది పేరు. ఈ ఒక్క గ్రామంలోనే 600 ఎకరాల్లో పూలసాగు చేస్తున్నారు. ఇక్కడ పండించే మల్లెలు, కాగడాలు, విరజాజులకు మంచి డిమాండ్ ఉంది. ఎంతో శ్రమించి పూలసాగు చేపడుతున్న రైతులకు అనుకున్నంతగా లాభాలు దక్కడం లేదు.
మార్కెట్ ఒడుదొడుకులు వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని అందించడం లేదు. కొన్ని రోజుల వరకు కిలో 250 నుంచి 350 రూపాయలు పలికిన మల్లెలు, ప్రస్తుతం 150కి పడిపోయాయి. దీంతో విధి లేక వ్యాపారులకు నచ్చిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ దిగుబడి ఉన్నప్పుడు డబ్బులు వస్తున్నా మంచిరేటు దక్కుతున్నా, ఎక్కువ రోజులు ఈ పరిస్థితి కొనసాగడం లేదు. ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు మాత్రం పూల రేటు అమాంతం తగ్గిపోతోంది.
కష్ట కాలంలో మల్లె రైతులు - పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్న కర్షకులు
రైతులు నేరుగా అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో స్థానిక వ్యాపారులకే తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పెట్టుబడి తడిసి మోపెడవుతుండగా, రైతులకు అందుకు తగ్గ లాభాలు రావడం లేదు. ఒక్కోసారి వారు కోసిన పూలు కూలీల ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. దీనికితోడు పంటపై తెగుళ్లు ఉద్ధృతి రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. తమకు గిట్టుబాటు ధర రాకున్నా అమ్ముకోవల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు అక్కడి పూల రైతులు.
పూలు సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఎకరాకు లక్ష రూపాయల కౌలుతో పాటు మరో లక్ష రూపాయల పెట్టుబడి వ్యయమవుతోంది. ఎకరాకు రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తేగాని ఈ రైతులు కుదుటపడే అవకాశం లేదు. కొందరికి కౌలు సొమ్ములు కూడా రావడం లేదు. స్థానిక మార్కెట్ గిట్టుబాటు కావడం లేదంటూ పక్కరాష్ట్రాలకు కొందరు రైతులు ఎగుమతులు చేస్తున్నారు. ఇక్కడే పక్కాగా పూలను ప్యాకింగ్ చేసి అక్కడికి పంపిస్తున్నారు.
విరబూస్తున్న మల్లెలు.. రైతులకందని ఆదాయ పరిమళాలు
అయినప్పటికీ ఆశించిన లాభాలు రావడం లేదంటున్నారు రైతులు, వ్యాపారులు. ఇక్కడి మల్లె, విరజాజులు, కాగడాల పూలను విదేశాలకు ఎగుమతులు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని, సెంటు పరిశ్రమను ఏర్పాటుచేయాని రైతులు, స్థానిక వ్యాపారులు కోరుతున్నారు. మార్కెటింగ్ ఒడుదొడుకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా పూల ఆధారిత సుగంధ ద్రవ్యాల పరిశ్రమను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
Marigold Farmers Gets Loss: అమాంతం పడిపోయిన బంతి ధరలు.. గిట్టుబాటలేక రోడ్లపై పారబోత..