AP Govt Focus on Jal Jeevan Mission : జలజీవన్ మిషన్ పథకం 2019 ఆగస్టులో ప్రారంభమయ్యాక గత ఐదేళ్లలో గ్రామాల్లో 39.39 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం 95.44 లక్షల ఇళ్లకు 2019 ఆగస్టు 15 నాటికే 30.74 లక్షల ఇళ్లకు ఉన్న తాగునీటి కుళాయి కనెక్షన్లతో కలిపి మొత్తం వీటి సంఖ్య 70.14 లక్షలకు చేరింది. అయినా గ్రామీణ ప్రజలకు రక్షిత తాగునీరు ఎందుకు అందట్లేదు? కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
YSRCP Govt Neglect Jal Jeevan Mission : ఈ నెల 5న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో జలజీవన్ మిషన్ పనుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుద్ధి లేకుండా పనులు చేశారని ఇంజినీర్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పల్స్ సర్వే ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన పనుల్లో లోపాలు గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది.
గత ఐదేళ్లలో ఇచ్చిన 39.39 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లలో సగం ఇళ్లకు ఇప్పటికీ తాగునీరు అందట్లేదు. చాలాచోట్ల కనెక్షన్లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. దీంతో ప్రజలు యథావిధిగా చెరువులు, కాలువలు, చేతి పంపులు, చేతి పంపులు, గిరిజన గ్రామాల్లో గెడ్డలపై ఆధారపడుతున్నారు. వర్షాకాలంలో కలుషిత నీటితో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. జలజీవన్ మిషన్ పథకం అమలులో దేశంలో ముందుండే గుజరాత్, పంజాబ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లో నీటి లభ్యత ఉన్నచోట, రక్షిత నీటి పథకాల సామర్థ్యం పెంచిన గ్రామాల్లో తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు.
నిధులన్నీ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే : ఏపీలో ఇందుకు విరుద్ధంగా, నీటి లభ్యతతో పనిలేకుండా ఎడాపెడా కనెక్షన్లు ఇచ్చేశారు. అన్నమయ్య, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇలానే చేశారు. 4 జిల్లాల్లోని గ్రామాల్లో 99 శాతం ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రానికి గత సర్కార్ నివేదించింది. కానీ నీటిలభ్యత లేకుండా ఇచ్చిన కనెక్షన్లు అలంకారప్రాయంగా మిగిలాయి. జలజీవన్ మిషన్ ద్వారా ప్రజల కంటే అస్మదీయ గుత్తేదారు సంస్థలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించింది. కీలకమైన పనులన్నీ మేఘా లాంటి సంస్థలకే అప్పగించారు. గత ఐదేళ్లలో చేసిన చెల్లింపుల్లో ఆ సంస్థలకే ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సైతం ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు రూ.700 కోట్ల వరకు అదే సంస్థకు చెల్లింపులు చేశారు.
నిధుల ఖర్చులోనూ గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం : జలజీవన్ మిషన్ పథకానికి కేంద్రం కేటాయించిన నిధుల ఖర్చులోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేంద్రం గత ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.16,483 కోట్లు కేటాయించింది. ఇందులో 1,904.77 కోట్లే ఖర్చు చేసింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులిస్తే రాష్ట్రప్రభుత్వ వాటాగా మరో 50 శాతం కేటాయించాలి. కానీ వైఎస్సార్సీపీ సర్కార్ రాష్ట్రవాటా నిధులు సరిగా సమకూర్చకపోవడంతో కేంద్రం అరకొరగానే నిధులిచ్చింది.