Jagan Govt Cheated Unemployed in the name of Job Calendar: ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు ప్రతిపక్ష నేత హోదాలో ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల ఓట్లు దండుకున్న జగన్ తీరా గద్దెనెక్కాక వారిని నిట్టనిలువునా ముంచేశారు. అరకొర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వారి ఆశలపై ఐదేళ్లుగా నీళ్లు చల్లుతూనే ఉన్నారు. గ్రూప్-1, డీఎస్సీ పరీక్షలు సైతం వివాదాస్పదంగా మారడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం మాటున ఉచితాలిస్తూ యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.
జాబ్ క్యాలెండర్‌ను మడతెట్టేసిన 'జగన్ మామ' - నిరుద్యోగులతో బంతాట !
జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు అండగా ఉంటామని ఊదరగొట్టిన జగన్ సర్కారు ఐదేళ్లుగా వారిని వంచిస్తూనే ఉంది. విడుదల చేసిన ఒకట్రెండు నోటిఫికేషన్లు సైతం మధ్యలోనే వివాదాస్పదమవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 2018 గ్రూప్-1పై హైకోర్టు తీర్పు, డీఎస్సీ నోటిఫికేషన్ సైతం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం జగన్ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో రుజువు చేశాయి. ఎంతో ఆర్భాటంగా 6 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం శారీరక ధారుడ్య పరీక్షల ఊసే మరచిందని అభ్యర్థులు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు - అడ్డుకున్న పోలీసులు - పలువురు అరెస్ట్
గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగ రేటుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్రం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(Periodic Labor Force Survey) నివేదికలో తేలింది. రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే 11 శాతం అధికంగా ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ గతేడాది విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని నిరక్షరాస్యుల్లో ఉపాధి లేనివారు 3.03 శాతంగా ఉంటే పట్టభద్రుల్లో 35.14 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వెనుకబడిన బిహార్ రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగైన స్థానంలో ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ 9వ స్థానం, తమిళనాడు 10వ స్థానంలో నిలిచాయి.
అధికారుల సమాచార లోపంతోనే ఆలస్యం-మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటున్న నిరుద్యోగులు
యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తామన్న జగన్ నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటును గాలికొదిలేశారు. ఇంజినీరింగ్ చేసేవారికి విశాఖపట్నంలో హైఎండ్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి దానిని అటకెక్కించారు. చంద్రబాబుపై కక్ష సాధింపుతో నైపుణ్య కేంద్రాలను మూసేసి యువతను అంధకారంలో నెట్టేశారు. ఏటా డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతరత్రా కోర్సులు పూర్తిచేస్తున్న 2.3 లక్షల మంది నిరుద్యోగులకు తగినంత నైపుణ్య శిక్షణ దొరకడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు నిర్లక్ష్య ధోరణితో పేద విద్యార్థులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.