Issues in Telangana Gruha Jyothi Scheme : అర్హత ఉన్నా తమకు గ్యాస్ సబ్సిడీ అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జీరో కరెంటు బిల్లులకు అర్హత సాధించినా, గ్యాస్ సబ్సీడీ ఎందుకు రావడం లేదని, తమ ఖాతాల్లో ఆ మొత్తం జమ కాకపోవడానికి కారణమేంటని పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. పథకం మొదట్లో జమ కానివారు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగారు, అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా ఆగిపోయారు. కానీ ఇప్పటికీ నగదు జమకాకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
జీరో కరెంటు బిల్లు వస్తున్నా, సబ్సిడీ రావట్లే : ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో విద్యుత్ బిల్లు, వంటగ్యాస్ సబ్సిడీకి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. గ్రేటర్ పరిధిలో 17 లక్షలకు పైగా తెలుపు రేషన్ కార్డులున్న కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 7.4 లక్షల మందికే జీరో బిల్లు వస్తుండగా, కేవలం 3 లక్షల మందికే వంట గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
తెల్ల రేషన్ కార్డు ఉన్నా రాని గ్యాస్ సబ్సిడీ : ప్రస్తుతం 14.5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.855లు. అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.41లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.315లు సబ్సిడీ వస్తోంది. గ్యాస్ కొనుగోలు చేసిన రెండు నుంచి మూడు రోజుల్లో ఈ సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాల్లో పడుతుంది. గ్యాస్ సబ్బీడీ కానివారు ఎవరిని సంప్రదించాలో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. సబ్బిడీకి అర్హులైనప్పటికీ ఎందుకు నగదు జమ కావడం లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఎక్స్‌లో బాధితుడి ఫిర్యాదు : తమకు అన్ని అర్హతలు ఉన్నా గ్యాస్ సబ్సిడీ పథకం అమలు కావడం లేదంటూ బహదూర్‌పురా కామటిపురాకు చెందిన మహ్మద్‌ఖాన్ ఆయిల్ కంపెనీలను ఎక్స్‌లో ఫిర్యాదు చేశాడు. జీరో విద్యుత్ బిల్లులకు అర్హత సాధించగా, వంట గ్యాస్ రాయితీ డబ్బు ఖాతాలో జమ కావడం లేదని వాపోయారు. ఇదిలా ఉండగా, గ్యాస్ సబ్సిడీ ఎంతమందికి అందుతుందనే వివరాలు పౌర సరఫరాలశాఖ అధికారులు అధికారికంగా చెప్పడం లేదు.
వంట గ్యాస్ కనెక్షన్లు :
- హైదరాబాద్ జిల్లాలో 14 లక్షలు
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16 లక్షలు
- గ్రేటర్ పరిధిలో తెలుపు రంగు రేషన్ కార్డులు 17 లక్షలు
- జీరో కరెంటు బిల్లులు వర్తించిన వారి సంఖ్య 7,40,512
వరుసగా రెండోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర- ఎంతంటే? - LPG Cylinder Price Hiked Today