Irrigation Secretary on Kotepally Vagu Project Issue : వికారాబాద్ జిల్లాలో కోటిపల్లి వాగు ప్రాజెక్టులోని సీసీ లైనింగ్, పూడికతీత పనులను అంచనాల నుంచి ఎందుకు తొలగించారనే విషయం తెలుసుకునేందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఫోన్ కాల్స్ చేస్తే మీరు ఎత్తారా లేదా స్పష్టంగా వివరించండని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్‌కు మెమో జారీ చేశారు.
TG Speaker On Kotepally Vagu Project Issue : గత కొద్దిరోజులుగా కోటిపల్లివాగు ప్రాజెక్టు అంచనాలకు సంబంధించిన విషయంపై ఒకవైపు ప్రభుత్వంలో, మరోవైపు నీటిపారుదల శాఖలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ స్పీకర్‌కు సంబంధించి ప్రొటోకాల్ పాటించలేదంటూ శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. దీంతో ఆమె ఈ విషయంపై నీటిపారుదల శాఖను వివరణ కోరారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ అనిల్‌కుమార్‌ను వివరణ కోరారు.
ఈఎన్సీపై చర్యలు తీసుకోండి : ఈ నేపథ్యంలో ఈఎన్సీ అనిల్‌కుమార్ సమర్పించిన వివరణలో తీరకలేని విధుల్లో ఉన్నప్పటికీ ఫోన్ కాల్స్ ఎత్తినట్లు సమాధానమిచ్చారు. దీంతో ఈ సమాధానం సహేతుకంగా లేదని, సభాపతి ఫోన్‌కాల్స్ ఎత్తారా లేదా? అనేది స్పష్టంగా చెప్పాలంటూ నీటిపారదుల శాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు.
కోటిపల్లి వాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ పనులపై తాను చేసిన ప్రతిపాదనల్లో పూడికతీత, సీసీ లైనింగ్ పనులు ఎందుకు తొలగించారని తెలుసుకునేందుకు ఈఎన్సీకి ఫోన్ చేస్తే ఎత్తలేదంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎస్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ లేఖ రాశారు. ప్రొటోకాల్ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.