irregularities in Tirumala During YSRCP Government : వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల కొండపై సాగిన దర్శన టికెట్ల దందాను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిగ్గుతేల్చింది. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఏకంగా ఏడాదికి లక్ష బ్రేక్ దర్శనాలు ఇప్పించినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపింది. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా ఇంజినీరింగ్ పనులకు అవసరానికి మించి నిధులు ఖర్చు చేశారని, దానికి నాటి ఈవో ధర్మారెడ్డి కూడా వత్తాసు పలికారని స్పష్టం చేసింది.
4లక్షల బ్రేక్‌దర్శనాలకు సిఫార్సు : గత ఐదేళ్లలో తిరుమలను వైఎస్సార్సీపీ నేతలు ఎలా వాడుకున్నారో వేంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని ఎలా దోచుకుతిన్నారో విజిలెన్స్ నిగ్గుతేల్చింది. నాడు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున తన పదవిని దుర్వినియోగం చేసి బ్రేక్‌దర్శన టికెట్లను కేటాయించినట్లు విజిలెన్స్అధికారులు గుర్తించారు. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి దాదాపు నాలుగేళ్లు టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా ఆ నాలుగేళ్లలో సుమారు 4లక్షల బ్రేక్‌దర్శనాలకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంటే రోజూ 273 మందికి ఇప్పించారు. 300 రూపాయల దర్శన టికెట్లు రోజూ 2 నుంచి 3వేల వరకూ వైవీ కార్యాలయం నుంచి సిఫార్సు చేసినట్లు తేల్చారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు ఒకే సామాజికవర్గానికి చెందిన నాటి ప్రజాప్రతినిధులకు ఇష్టానుసారంగా సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు కేటాయించినట్లు గుర్తించారు.
శ్రీవారిని దర్శించుకున్న 2.25కోట్ల భక్తులు - హుండీ ఆదాయం ఎంతో తెలిస్తే షాక్!
ఇక తిరుమల ప్రసాదాల ముడిసరుకుల్లోనూ భారీగానే అక్రమాలకు తెగించారని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.
తిరుమలలో ప్రసాదాల్లో వాడే బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు నివేదించారు. ధర తక్కువగా ఉన్నప్పుడు రెండు నెలలకు, ధర అధికంగా ఉన్నప్పుడు ఆరు నెలలకు సేకరించినట్లు గుర్తించారు. టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా గుత్తేదారులు ద్వితీయశ్రేణి సరకులిచ్చినా పట్టించుకోకుండా టీటీడీకి నష్టం చేకూర్చి నట్లు తేల్చారు.
సుబ్బారెడ్డి సారథ్యంలోనే కాదు ఆయన తర్వాత టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి హయాంలోనూ నష్టం జరిగిందని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి సత్రాలు కూల్చి రూ. 600 కోట్లతో అచ్యుతం, శ్రీపథం వసతిగృహాలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. 2023 ఫిబ్రవరిలో సత్రాల మరమ్మతులకు రూ. 30 కోట్ల 60 లక్షలు కేటాయించాలంటూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదించారు.
ఆ అధికారి తీరే అంత! కొండపై దొరికిన వస్తువులు స్వాహా
మరమ్మతులకు ఆస్కారం ఉన్నా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఆ రెండు సత్రాలు కూల్చేసి, కొత్త నిర్మాణాలకు టెండర్లు పిలవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని విజిలెన్స్ పేర్కొన్నట్లు తెలిసింది. కరుణాకర్‌రెడ్డి హయాంలో అవసరం లేకపోయినా ఇంజినీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయించడం టీటీడీకి భారంగా పరిణమించినట్లు విజిలెన్స్ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. నాటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సైతం వారికి వత్తాసు పలికినట్లు పేర్కొన్నారని సమాచారం. ఇటీవలే ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ - ఇలా చేస్తే టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఇంటికే!