Irregularities in Jagananna Housing Layout in Pulivendula : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న గృహనిర్మాణాలు అవినీతికి చిరునామాలుగా నిలిచాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ నేతల అవినీతిలీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మాజీ సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు బయటపడ్డాయి. లేఅవుట్‌లో అనర్హులకు ఇళ్ల కేటాయించి వైఎస్సార్సీపీ నేతలు భారీగా దోచుకున్నట్లు కలెక్టర్ విచారణలో తేలింది.
లేఅవుట్లో భారీ అక్రమాలు : పులివెందులలో మాజీ సీఎం జగన్ 2021లో జగనన్న మెగా లే అవుట్ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ భారీ లేఅవుట్ లో 8,468 ఇళ్ల నిర్మాణానికి వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రాక్రీట్ సంస్థ గుత్తేదారు బాధ్యతలు తీసుకుంది. ఈ ఇళ్లలో భారీ అక్రమాలు జరిగాయని అనర్హులకు, రేషన్ కార్డు లేని వారికి, స్థానికేతరులకు, ఆధార్ కార్డు లేనివారికి ఇళ్లు మంజూరు చేశారని తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన లేఖపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలపాటు విచారణ జరిపింది. తాజాగా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లే అవుట్ లో జరిగిన అక్రమాల బాగోతాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
పెద్దిరెడ్డి చెరలో 236 ఎకరాలు - ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు - Peddireddy Land Grabs
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో గృహ నిర్మాణాల లబ్ధిదారుల్లో 2,489 మంది అనర్హులున్నట్లుగా అధికారులు చేపట్టిన విచారణలో తేలింది. 2021లో పని చేసిన జాయింట్ కలెక్టర్ గౌతమి, పురపాలక సంఘం కమిషనరు నారాయణరెడ్డి ఆక్రమాలకు పాల్పడ్డారని విచారణలో గుర్తించారు.
అనర్హులకు నోటీసులు జారీ : 2021 డిసెంబరు 24న అప్పటి ముఖ్యమంత్రి జగన్ ద్వారా జగనన్న మెగా లేఅవుట్లో 7,075 మందికి పట్టాల పంపిణీ చేయగా వీరిలో 1,675 మంది అనర్హులుగా ఎన్బీఎం పోర్టల్ ద్వారా చేపట్టిన డిజిటల్ పరిశీలనలో తేల్చారు. సొంత స్థలాల్లో నిర్మాణానికి 1,318 మందికి ఇళ్లు మంజూరు చేశారు. వీరిలో 732 మంది అనర్హులుగా ఉన్నట్లు తేలింది. అనర్హులకు నోటీసులు జారీ చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఏపీఐఐసీ కింద సేకరించిన అత్యంత ఖరీదైన భూములను అనర్హులకు సైతం కేటాయించారనే అభియోగాలపై విచారణ జరిగింది. పులివెందులలోని జగనన్న మెగా లే అవుట్‌లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో అనర్హులకు ఇళ్లు మంజూరు చేసిన గృహనిర్మాణశాఖ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.