IPS PSR Anjaneyulu Try to Meet CM Chandrababu: హైదరాబాద్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు విఫలయత్నం చేశారు. అపాయింట్మెంట్ లేదని చెప్పినా ఆయన చంద్రబాబు ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంటి వద్దకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు శనివారం రెండు సార్లు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆయనకు సమయం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నిరాకరించింది. గేటు దగ్గర నుంచే అధికారిని భద్రతా సిబ్బంది వెనక్కి పంపారు. పిలుపు లేకపోయినా, సమయం ఇవ్వక పోయినా చంద్రబాబును కలిసేందుకు వైఎస్సార్సీపీ విధేయులుగా ముద్రపడ్డ అధికారులు విఫల యత్నాలు చేస్తున్నారు.
వైఎస్సార్సీపీతో అన్ని విధాలుగా అంటకాగి, ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారనే విమర్శలు ఎదుర్కొంటున్న నిఘా విభాగం మాజీ అధిపతి పి. సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. అపాయింట్‌మెంట్ లేకున్నా సరే సీఎంను కలవాలంటూ ఆయన నివాసం చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉండటంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు సీతారామాంజనేయులు శని, ఆదివారాల్లో మూడు సార్లు వెళ్లారు. భద్రతా సిబ్బంది ఆయన్ను గేటు వద్దే ఆపేసి వెనక్కి పంపించేశారు. ముందస్తు అపాయింట్‌మెంట్లు, అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి ఎవర్నీ కలవడం లేదని చెప్పి తిప్పి పంపించేశారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా అందుకు నిరాకరించారు.
జగన్ ప్రభుత్వ పాపాల్లో ప్రధాన పాత్ర వహించారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ఐపీఎస్ అధికారి ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి చంద్రబాబును కలిసి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు. సీఎం అనుమతి ఇవ్వకున్నా, పిలవకున్నా పదే పదే ఆయన్ను కలిసేందుకు యత్నిస్తున్నారు. జూన్ 6న ఉండవల్లిలోని నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు యత్నించగా అప్పుడు కూడా భద్రతా సిబ్బంది గేటు వద్ద నుంచే వెనక్కి పంపించేశారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జూన్ 13న చంద్రబాబు తొలిసారి సచివాలయానికి వెళ్లగా అప్పుడు సీతారామంజనేయులు సీఎంను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా అనుమతి లేదంటూ అధికారులు వెనక్కి పంపించేశారు. వైఎస్సార్సీపీతో అంటకాగిన మరికొందరు ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.