IPL Final Match Betting in Hyderabad Today 2024 : ఐపీఎల్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే అంతిమ సమరంలో ట్రోఫీ అందుకునే విజేత ఎవరని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఎక్కడ చూసినా ఈరోజు జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముచ్చట్లే. అభిమానులను ఆకర్షించేందుకు కాఫీ క్లబ్‌లు, హోటళ్లు భారీ తెరలు ఏర్పాటు చేశాయి. క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి.
వాట్సాప్ గ్రూపులలో బెట్టింగ్ పెట్టే వాళ్లకు సమాచారం అందించారు. ఆఖరి మ్యాచ్‌ను సొమ్ము చేసుకునేందుకు దేశంలోని ప్రధాన బుకీలు హైదరాబాద్ నగరంలో మకాం వేసినట్టు సమాచారం. బేగంబజార్, ఘాన్సీబజార్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అబిడ్స్, ప్రాంతాల్లోని ఖరీదైన హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్స్, ఫామ్ హౌస్‌ల్లోని గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
బెస్ట్ vs బెస్ట్: రైజర్స్- రైడర్స్- కప్పు కొట్టేదెవరో? - IPL 2024
KKR VS Sunrisers Match Betting : సాంకేతిక పరిజ్ఞానం, యాప్‌లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా రూ.1000 నుంచి రూ.10లక్షల వరకూ పందేలు ఆహ్వానిస్తున్నారు. కేపీహెచ్‌బీకాలనీ సమీపంలో కొందరు బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండటాన్ని స్థానికులు గుర్తించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారంతా దుకాణం సర్దుకున్నట్లు సమాచారం. బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. బుకీల స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Cricket Betting in Hyderabad : చేతిలో స్మార్ట్‌ఫోన్ లోన్ యాప్‌లతో అప్పులు రెట్టింపు లాభాలంటూ యాప్‌ల్లో ప్రకటనలు. ఇవన్నీ యువతను ఆకర్షిస్తున్నాయి. నగరంలో ఐపీఎల్ సీజన్‌లో రూ.500 కోట్లమేర పందెపు సొమ్ములు చేతులు మారుతుంటాయని అంచనా. వీటిలో కేవలం 5-10శాతం మాత్రమే పట్టుబడుతున్నాయి. ఆన్‌లైన్ ద్వారా పందేలు జరగటంతో నిఘావర్గాలు గుర్తించలేకపోతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున రూ.2.5కోట్లు పందెం కాశానంటూ ఓ ఇంటర్నేషనల్ సింగర్ ప్రకటించాడు. దీన్ని బట్టి ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఏ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో చాలా మంది యువకులు, ఉద్యోగులు క్రికెట్ బెట్టింగ్‌కు బానిసలుగా మారారు. రూ.లక్షల్లో అప్పులు చేసి తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు.