Non-Deposit Investment Assistance In Farmers Accounts: సంక్రాంతికి ఇస్తామన్న పెట్టుబడి సాయం నాలుగున్నర నెలలు గడచినా ఇప్పటికీ అధికశాతం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు హడావుడి చేసి మే 18న ఇదిగో 1,294 కోట్ల రూపాయలు ఇచ్చేశామని లెక్కలు విడుదల చేశారు. అయినా 50 శాతం మందికి పైగా రైతుల ఖాతాల్లో ఇప్పటికీ సొమ్ము జమకాలేదు. గతేడాది ఖరీఫ్ నష్టానికి ఇప్పటికీ సాయం దక్కకపోగా రబీకి కూడా నీలినీడలేనా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
తుపాను నష్టానికి అరకొర సాయమే: కరవు, తీవ్ర తుపానుతో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి సాయాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పండక్కి సాయం చేతికందుతుందని రైతులంతా ఆశించారు. అయితే పైసా కూడా జమ కాలేదు. మార్చి 6వ తేదీన ప్రకాశం జిల్లాలో పెట్టుబడి రాయితీ విడుదల చేస్తున్నామంటూ బటన్ నొక్కారు. అదీ ఉత్తుత్తి నొక్కుడే తప్ప రైతుల ఖాతాల్లోకి డబ్బు మాత్రం రాలేదు.
పండుఈగతో మామిడి రైతుకు నష్టం - ఎరువులపై సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం - Loss Money to Mango Farmers
పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు జమ చేస్తామంటూ హడావుడి చేశారు. అయితే పోలింగ్ తర్వాత జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. రైతులకు పెట్టుబడి సాయంగా 1,294 కోట్లు విడుదల చేశామని ఆర్థికశాఖ మే 18వ తేదీన ఇచ్చిన లెక్కల్లో వెల్లడించింది. అయితే గ్రామాల్లో 50శాతం మంది రైతులు తమ ఖాతాల్లో జమ కాలేదని చెబుతున్నారు. ఆర్థికశాఖ చెప్పిన మాటల్లో నిజమెంత అనే ప్రశ్న అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.
పెట్టుబడి సాయం జమ చేశామని ప్రభుత్వం చెప్పడంతో ఖాతాలో పడిందేమో చూడండయ్యా? అని రైతులు మండుటెండల్లో బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇంకా సొమ్ము జమ కాలేదని, ఖాతాలో వేసిన వెంటనే మొబైల్‌కు సందేశం వస్తుందని అక్కడి అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, ఆర్‌బీకేల్లోని వ్యవసాయ సహాయకుల్ని అడిగితే తమకేమీ సమాచారం లేదని నేరుగా ఆర్థికశాఖ ద్వారా ఖాతాల్లో వేస్తారని సమాధానమిస్తున్నారు. ఎప్పుడు జమ అవుతుందో, అసలు వేస్తారో లేదో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో కరవు నష్టానికి పెట్టుబడి సాయం ఇంకెప్పుడిస్తారో అని కలవరపడుతున్నారు.
చావనైనా చస్తాం కానీ, భూములు వదులుకోం: విశాఖ భూ బాధితులు - LAND GRAB IN VISAKHA
గతేడాది ఖరీఫ్ నష్టానికి దక్కని సాయం: 2023 ఖరీఫ్‌లో తీవ్ర కరవు కారణంగా 31 లక్షల ఎకరాల్లో విత్తనం పడలేదు. 88.55లక్షల ఎకరాల్లో పంటలు వేయగా వర్షాలు లేక, సాగునీరందక 23 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 466 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులుంటే 103 కరవు మండలాలనే ప్రకటించి సరిపెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం 14లక్షల ఎకరాల్లోనే పంటనష్టం జరిగినట్లు తేల్చింది. రైతులకు పెట్టుబడి రాయితీ కింద 847 కోట్ల రూపాయలు లెక్కకట్టారు. ఖరీఫ్, రబీ ముగిశాయి. మళ్లీ రబీ కూడా వచ్చింది.
ఇప్పటికీ పెట్టుబడి రాయితీ పూర్తిగా జమ కాలేదు. గతేడాది డిసెంబరు మొదటి వారంలో మిగ్‌జాం తీవ్ర తుపాను విరుచుకుపడింది. 22 జిల్లాల్లో రైతులపై ప్రభావం చూపింది. సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఉంటాయని అంచనా. 11 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ కేంద్రానికి తెలియజేసింది. తీరా పంటనష్టం గణన నాటికి 6.64లక్షల ఎకరాల్లోనే పంటనష్టమంటూ తేల్చి 442 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం మాత్రమే ప్రకటించారు.
'మల్లె'కు కలిసిరాని మార్కెట్- వాడిపోతున్న అన్నదాతల ఆశలు - Jasmine Farmers Suffering
ఆర్థికశాఖ చెప్పింది నిజం కాదా?: 2023-24 రబీ పంటకాలంలోనూ 661 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులే నెలకొన్నాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికే కరవు మండలాల్ని ప్రకటించి పంటనష్టం గణన పూర్తి చేయాల్సి ఉన్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. షెడ్యూల్ వెలువడిన రోజు 87 కరవు మండలాల ప్రకటన చేసింది. మే చివరి వారంలో పంటనష్టం గణన చేపట్టింది. వాస్తవానికి రబీ సాధారణ విస్తీర్ణం 60.50లక్షల ఎకరాలు కాగా 43.75లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. 16.75 లక్షల ఎకరాల్లో విత్తనమే పడలేదు.
వానల్లేక సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు ఎండిపోయాయని అంచనా. అయితే వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల్లో 87 మండలాల్లో 2.52లక్షల ఎకరాల్లోనే పంటనష్టం అని గుర్తించింది. దీనికి కూడా సాయం ఎప్పటికి ఇస్తారనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇంకా కేంద్ర బృందం పరిశీలన కూడా చేయలేదు. కేంద్ర బృందం వచ్చినా పొలాల్లో ఎక్కడా పైరు కన్పించదు. దీంతో పెట్టుబడి సాయంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
పత్తి విత్తనాల కొరత - ఈ ఏడాది 'సాగే'దెలా? - వ్యాపారులతో కుమ్మక్కై అధిక ధరలకు విక్రయాలు