Investigation on Rayachoty Teacher Ahmed Death Case : అన్నమయ్య జిల్లా రాయచోటి ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ముగ్గురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పిల్లల చేష్టలకే ఉపాధ్యాయుడు అహ్మద్ తనువు చాలించారని విద్యాశాఖాధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై శాఖాపర చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
Students Attack on Rayachoti Urdu Teacher Death : అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు అహ్మద్ అనుమానాస్పద మృతిపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. కడప ఆర్జేడీ శామ్యూల్, రాయచోటి డీఈఓ సుబ్రమణ్యం, డిప్యూటీ డీఈవో శివప్రకాశ్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్‌కు వెళ్లి అసలేం జరిగిందో ఆరా తీశారు.
బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో 9వ తరగతి గదిలో ఉపాధ్యాయులెవరూ లేకపోవడంతో పిల్లలు అల్లరి చేస్తున్నారు. పక్క గదిలో పాఠాలు బోధిస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు అహ్మద్ అల్లరి చేస్తున్న విద్యార్థుల గదిలోకి వెళ్లి మందలించారు. ముగ్గురు విద్యార్థులు గొడవ పడుతుండగా అడ్డుకునే క్రమంలో వారిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై తిరగబడి చేయి చేసుకున్నారని, విచారణలో తేలింది.
ముగ్గురూ కలిసి తోసేయడంతో ఆయన కింద పడిపోయారని, పిల్లలందరి ముందు విద్యార్థులు చేయి చేసుకోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన అహ్మద్ అరగంట పాటు చాలా కుంగిపోయారని గుర్తించారు. ఆ సమయంలోనే ఊపిరి ఆడక, గుండెనొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయారు. ఈ మేరకు విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను విచారించి స్టేట్‌మెంట్లు నమోదు చేసుకున్నారు.
తరగతి గదిలో ఉపాధ్యాయుడు మృతి - అనుమానం వ్యక్తం చేసిన భార్య
ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విచారణ అధికారులు అంచనాకు వచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని, విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం శవ పరీక్ష పూర్తి చేసి అహ్మద్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అంబులెన్స్ వద్ద అహ్మద్ భార్య రెహమూన్, బంధువులు ధర్నాకు దిగారు. తన భర్త చావుకు ముగ్గురు విద్యార్థులతో పాటు కొందరు టీచర్ల పాత్ర కూడా ఉందని అహ్మద్ భార్య ఆరోపించారు. వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శవ పరీక్ష నివేదిక ఆధారంగా చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. విచారణ నివేదిక అందగానే, ఒకరిద్దరు ఉపాధ్యాయులపై వేటు పడే అవకాశం ఉంది.