India Cyber Threat Report 2025 : వచ్చే సంవత్సరం ఏఐ పరిజ్ఞానంతో కూడిన మాల్‌వేర్‌లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశముందని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ), సెక్‌రైట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ‘ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్-2025’ అంచనా వేసింది. అదే పరిజ్ఞానంతో వాటిని నియంత్రించే ఆస్కారమూ ఉందని పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 11 సైబర్ దాడులు జరిగినట్లు నిర్ధారించింది.
హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఆతిథ్యం వంటి రంగాలపై ఈ దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మాల్‌వేర్ల ద్వారా దాడులు జరిపి వ్యక్తిగత జీవితాల్లోకీ చొరబడతారని పేర్కొంది. బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింతగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని నకిలీ యాప్‌లు, నకిలీ దరఖాస్తుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశముందని వివరించింది. పెట్టుబడిదారులను మోసగించడం ద్వారా భారీగా సొమ్ము కొల్లగొట్టే నేరాలు మరింత పెరుగుతాయని వెల్లడించింది. సైబర్ దాడులను సమర్థంగా తిప్పికొట్టే సాంకేతికతను మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నివేదిక సూచనలు చేసింది.
దేశంలో 2023 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సంవత్సరం కాలంలో జరిగిన సైబర్ దాడులపై డీఎస్‌సీఐ, సెక్‌రైట్ నివేదిక రూపొందించాయి. దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్‌పాయింట్ల (నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రం)లో 36.9 కోట్ల మాల్‌వేర్లతో దాడులు జరిగినట్లు నిర్ధారించారు. దీని ఆధారంగా భారత్‌లో నిమిషానికి సగటున 702 సైబర్ దాడులు జరిగినట్లు తేల్చారు. అంటే ప్రతి సెకనుకు 11 దాడులు జరిగినట్లు గుర్తించారు. హెల్త్‌కేర్ (21.82%), ఆతిథ్యం (19.57%), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్- బీఎఫ్‌ఎస్‌ఐ (17.38%), ఎడ్యుకేషన్ (15.64%), ఎంఎస్‌ఎంఈ (7.52%), మాన్యుఫ్యాక్చరింగ్ (6.88%), ప్రభుత్వ సంస్థలు (6.1%), ఐటీ/ఐటీఈఎస్ (5.09%) రంగాలు దాడులకు గురయ్యాయి. సగటున ప్రతి 40,436 మోసాల వెనుక ఓ మాల్‌వేర్ సగటున ప్రతి 595 మోసాల వెనుక ఓ ర్యాన్సమ్‌వేర్ ఉన్నట్లు రక్షణ వ్యవస్థల ద్వారా నిర్ధారించారు.
సంవత్సర కాలంలో 5842 హ్యాక్టివిస్టుల దాడులు : బృందాలుగా ఏర్పడి హ్యాకింగ్‌కు పాల్పడే సైబర్ నేరగాళ్లను ‘హ్యాక్టివిస్టు గ్రూపులు’గా వ్యవహరిస్తుంటారు. దేశంలోని పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఈ బృందాలు ఏడాది కాలంలో 5842 దాడులకు పాల్పడ్డాయి. దేశ సరిహద్దులకు అవతలి నుంచి ఈ ముప్పు ఎక్కువగా నెలకొందని నివేదిక తెలిపింది.
10 ర్యాన్సమ్‌వేర్ గ్రూపుల గుర్తింపు : ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో పాటు వ్యక్తులకు సంబంధించిన ఆన్‌లైన్ డేటాను దొంగిలించడం లేదా బ్లాక్ చేయడం ద్వారా హ్యాక్టివిస్టులు బెదిరింపులకు దిగుతున్నారు. అలా బ్లాక్ చేసిన డేటాను తిరిగి అప్పగించాలంటే పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. దీన్నే ర్యాన్సమ్‌వేర్‌గా పరిగణిస్తారు. అలాంటి 10 ప్రధాన ర్యాన్సమ్‌వేర్ గ్రూపులను గుర్తించారు.
- ప్లే
- అకీరా
- మ్యావ్
- రాయల్
- రైసిడా
- ర్యాన్సమ్‌హబ్
- లాక్‌బిట్ 3.0
- ప్లే
- బ్లాక్‌బస్టా
- 8బేస్
అత్యంత దుర్వినియోగానికి గురైన ఫైల్‌షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లివే : పలు సంస్థలు తమ డేటాను క్లౌడ్‌లో భద్రపరుస్తుంటాయి. దాన్ని ఒకే సమయంలో తమ యూజర్లు ఎంత మందికైనా షేర్ చేసుకునే అవకాశం కల్పించేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లున్నాయి. అలాంటి పలు క్లౌడ్ ఆధారిత ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లను సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారు.
- గూగుల్ డ్రైవ్
- డ్రాప్‌బాక్స్
- వన్‌డ్రైవ్
- గిట్‌హబ్
- మైక్రోసాఫ్ట్ టీమ్స్
- వుయ్ ట్రాన్స్‌ఫర్
- బాక్స్
- అమెజాన్ ఎస్3 బకెట్స్
- ఐబీఎం క్లౌడ్
- ఒరాకిల్ క్లౌడ్
దేశవ్యాప్త దాడుల్లో అత్యధికంగా 15.03 శాతం గుర్తించిన తెలంగాణ : దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో తెలంగాణ సత్తా చాటింది. నేరగాళ్లు పంపిన వాటిలో 15.03 శాతం మాల్‌వేర్లను గుర్తించింది. ఈ క్రమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ ఉండటం బలమైన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌లను ఏర్పర్చుకోవడం ఇందుకు కారణాలు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, దిల్లీ, గుజరాత్, రాజస్థాన్ ఉన్నాయి.
సైబర్ హైజీన్‌తోనే డిజిటల్ భద్రత : రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత మాల్‌వేర్లు, డీప్ ఫేక్ ఎక్స్‌ప్లాయిట్స్, డేటా చౌర్యం, ర్యాన్సమ్‌వేర్ లాంటి నేరాలకు ఆస్కారముందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫొరెన్సిక్స్ డైరెక్టర్ డా.ప్రసాద్ పాటిబండ్ల తెలిపారు. 5జీ నెట్‌వర్క్ విస్తృతితో సైబర్ నేరాలూ పెరుగుతాయని చెప్పారు. డిజిటల్ భద్రత కోసం బలమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సంస్థలు తమ ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు. డేటా సెక్యూరిటీ, మాల్‌వేర్ ప్రొటెక్షన్, సెక్యూర్ కాన్ఫిగరేషన్, డేటా బ్యాకప్ అండ్ రికవరీ, ప్రైవసీ కంట్రోల్ లాంటి సైబర్ హైజీన్‌కు ప్రాధాన్యమివ్వాలని వివరించారు. ముఖ్యంగా హ్యాకర్ల దాడులను తిప్పికొట్టేందుకు ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని డా.ప్రసాద్ పాటిబండ్ల వెల్లడించారు.
సైబర్ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం ఎందుకు 'గోల్డెన్ అవర్' గురించి తెలుసుకోండి
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే