Tomato Price Hike in AP : రాష్ట్రంలో టమాటా ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ధర మరింత పెరగవచ్చనే వాదన వినిపిస్తోంది. డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని వ్యాపారులు అంటున్నారు. అమాంతం ధరలు పెరిగిపోవడంతో కొనేందుకు వినియోగదారులు సంకోచిస్తున్నారు. మరోవైపు రైతు బజార్లలో ధరలకు రిటైల్ మార్కెట్ ధరలకూ భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ఈ విషయంపై కూడా చర్చనడుస్తోంది.
రాజమహేంద్రవరం టోకు మార్కెట్‌కు గతంతో పోల్చితే సగం సరకే దిగుమతి అవుతోంది. ధర తక్కువగా ఉన్నప్పుడు 30 టన్నులు వచ్చేది. ప్రస్తుతం 15 నుంచి 18 టన్నులు మాత్రమే వస్తోంది. రాజమహేంద్రవరంలోని పెద్ద రైతుబజార్లకు రోజుకు టన్ను, చిన్నవాటికి 50 క్వింటాళ్లు అవసరం కాగా ప్రస్తుతం అందులో సగం మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో టమాటా కేజీ రూ.17-రూ.18 ఉంది. ప్రస్తుతం రాయితీ టమాటానే రైతుబజార్లలో రూ.58కు అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్‌లో నాణ్యత ఆధారంగా కేజీ రూ.90 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది.
రాయితీ విక్రయాలు ప్రారంభం : రాజమహేంద్రవరం రైతుబజార్లలో రాయితీ టమాట అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా ఒక్కో రైతుబజారుకు 20 నుంచి 40 ట్రేలను సరఫరా చేస్తున్నారు. ఇందుకు కేజీ రూ.58 ధర నిర్ణయించారు. గత రెండు రోజుల నుంచి ప్రతి రోజూ రైతుబజార్లకు రాయితీ టమాట సరఫరా అవుతోందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
Rise in Tomato Prices 2024 : మరోవైపు పెదబొడ్డేపల్లి రైతుబజారులో వ్యాపారులు కిలో టమాటా ఏకంగా రూ.100కు విక్రయించారు. అవి కూడా చిన్న సైజువే కావడం గమనార్హం. భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా చిత్తూరు సమీపంలోని మదనపల్లె ప్రాంతంలో దిగుబడులు తగ్గడమే ధర పెరగడానికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత వారం కిలో రూ.50కే విక్రయించేవారు. క్రమేపీ రూ.70, రూ.80 చొప్పున పెరుగుతూ వందకు ఎగబాకింది.
డిసెంబర్ నుంచి నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పంట దిగుబడి వస్తుందని, అప్పటికీ ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. రావులపాలెం నుంచి వచ్చే దొండకాయలు గతంలో కేజీ రూ.20కి విక్రయించేవారు. ఇప్పుడు రూ.60కి పెరిగింది. బీరకాయలు కిలో రూ.70కి తగ్గడం లేదు. హైబ్రిడ్ మునగకాడ రూ.20 చెబుతున్నారు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ధరలు నిలకడగా ఉన్నాయి.
సాగు తగ్గింది కానీ ధర అదిరింది - టమోటా రైతుల్లో ఆనందం - Tomato Farmers Happy prices