AP Rain Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశంఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తేదీ వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
రైతులు జాగ్రత్తగా ఉండాలి: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయవద్దని సూచించింది. కోసినా పూర్తిగా ఆరని పనలను వర్షాల నేపధ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చనీ సూచించింది.
వరికుప్పలు పాడవకుండా ఉప్పు ద్రావణం: కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలంది. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని సూచించింది. మీ ప్రాంతంలో వ్యవసాయ సంబంధిత ఇతర సందేహాలు నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
కలెక్టర్లు, జేసీలకు ప్రభుత్వం సూచనలు: వర్ష సూచనతో కలెక్టర్లు, జేసీలకు ప్రభుత్వం సూచనలు చేసింది. జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని తక్షణం రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం, వర్షాల్లో వరికోతలు లేకుండా రైతులను అప్రమత్తం చేయాలని సూచించింది. ధాన్యం కుప్పలు వేయలేని చోట్ల రైతులకు టార్పలిన్లు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.
మరో అల్పపీడనం ఏర్పడవచ్చు: ఆగ్నేయ బంగాళాఖాతం-హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు తీర ప్రాంతాల్లో అలలు కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపాకు చెందిన వాతావరణ మోడల్ సూచిస్తోంది. ఇది 16, 17వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలో కొద్దిరోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ అలర్ట్ల గురించి తెలుసా? - ఏ అలర్ట్ ఇస్తే ఏం జరుగుతుందంటే!