Illegal Sand Mining in Krishna River at Papavinasanam: పాపవినాశనం వద్ద కృష్ణానదిలో అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలు కొన్నాళ్లుగా నిత్యకృత్యమైంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మూడు పొక్లెయినర్లతో కృష్ణానదిని (krishna River) తవ్వేస్తూ కృష్ణమ్మకు కడుపుకోతను మిగులుస్తున్నారు.
ఈ అక్రమ తవ్వకాలను సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు ఉదాసీన వైఖరి అవలంబించడంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేనప్పటికీ అడ్డగోలుగా జరిగే అక్రమ త్రవ్వకాలను అడ్డుకునే నాథుడు లేకపోవడం గమనార్హం. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, గ్రామస్థులు అధికారుల దృష్టికి వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ ఫలితం శూన్యంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
సంయుక్త కమిటీ పర్యవేక్షణలోనే కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు
కృష్ణానదిలో సుమారు 5 మీటర్ల లోతుగా ఇసుక తవ్వకాలు జరపడం వలన భూగర్బజలాలు అడుగంటి పోతున్నాయి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు వల్ల బోరు వేసినా నీరు రాకపోవడంతో కొందరు రైతులు పంటలు సాగు చేయలేక భూములు వదిలి వేస్తున్నారని స్థానికులు వెల్లడించారు. జీసీకేసీ ప్రాజెక్ట్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (gckc project and works pvt ltd) అనే పేరుతో బిల్లులు ఇస్తూ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. పొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు జరిపి పెద్ద పెద్ద టిప్పర్లు, లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. భారీ ఇసుక లోడుతో టిప్పర్లు కృష్ణానది కరకట్టపై నుండి వెళ్లటం వల్ల కరకట్ట గోతుల మయంగా మారింది. దీంతో కరకట్ట రోడ్డుపై పగుళ్లు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు.
కృష్ణా నదిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా
రాష్ట్రంలో ఇసుక టెండరులో జీసీకేసీ వారికి కేటాయించటంతో ఎంత లోతు తవ్వకాలు చేయాలి అనే అంశాల గురించి మైనింగ్ శాఖ ఎలాంటి అనుమతి ఉత్తర్వులు జారీ చేయకపోయినా తమను అడిగేది ఎవరు, అడ్డుకునేది ఎవరు అనే చందంగా నిత్యం వేలాది టిప్పర్ల ఇసుకను తరలిస్తూ నిత్యం లక్షలాది రూపాయిల ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతున్నారు. స్పందనలో మొవ్వ ఎన్ఫోర్స్మెంట్ వారికి గోరికపూడి విద్యాప్రసాద్ ఫిర్యాదు చేయగా ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపడం లేదని మొవ్వ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్రాత పూర్వకంగా లేఖలు ఇచ్చారని పేర్కొన్నారు.
"అక్రమ ఇసుక తవ్వకాలు వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివల్ల సాగు, తాగు నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అధికారుల అనుమతితో 2,3 మీటర్లు మేర తవ్వకాలు జరిపినా ఫర్వాలేదు.కానీ 5,6 మీటర్లు లోతు తవ్వకాలు జరపటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. అధికారులు తగిన చర్యలు తీసుకుని ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలి. రోజుకు 100 లారీలతో ఇసుక తరలిస్తున్నారు. సుమారు 10 నుంచి 15 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు ఈ నిధులు వెళ్తున్నాయి. టీడీపీ హయాంలో జిల్లా,మండల పరిషత్‌కు ఇసుక ద్వారా గ్రాంట్లు వచ్చేవి. వీటి ద్వారా పంచాయితీలకు మండల పరిషత్ ద్వారా నిధులు వచ్చేవి. వీటితో గ్రామాభివృద్ధి చేసుకునేవాళ్లం." - వెంకటేశ్వరరావు,ఎంపీటీసీ
Illegal Sand Mining in Krishna River: కృష్ణాతీరంలో ఇసుక తవ్వకాలు.. కొండలను తలపిస్తున్న ఇసుక డంపులు