Illegal Gravel Mining: రాజధాని ప్రాంతంలో ఉద్ధండరాయునిపాలేనికి చెందిన మట్టి మాఫియా చెలరేగిపోతుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో పేదలకు కేటాయించిన సెంటు భూమి స్థలాలలో విచ్చలవిడిగా మట్టిని తవ్వుతున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు తవ్వకాలు జరిపారు. కృష్ణాయపాలేనికి చెందిన రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో అక్రమంగా మట్టి తరలించుకుపోతున్నా పోలీసులు, సీఆర్డీఏ సిబ్బంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని రైతులు ఆరోపించారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు: మరోవైపు వైఎస్సార్ జిల్లాలోనూ మట్టి మాఫియా (Illegal Soil Mining in YSR District) చెలరేగిపోతోంది. ఏ భూములనూ వదలకుండా అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు. విషయం రెవెన్యూ అధికారులు తెలిసినప్పటికీ చోద్యం చూడటం విడ్డూరంగా ఉంది. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని విజయవాడ- బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి మండలంలోని పెదనపాడు, కోడూరు, సుంకేసుల, తిప్పలూరు గ్రామాల గుండా వెళ్లే ఆరు వరసల జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు.
జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అవసరమైన మట్టిని రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే సంబంధిత కాంట్రాక్టర్లు ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు చేపట్టారు. పెదనపాడులో 247-బీ సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో గుట్టల నుంచి అక్రమంగా జేసీబీలతో మట్టిని తొవ్వేస్తున్నారు. గత వారం రోజుల నుంచి రాత్రింబవళ్లు పెద్దపెద్ద యంత్రాలతో మట్టిని తవ్వుతూ వందల టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకునేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సహజ వనరులను కొల్లగొడుతుంటే రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాలలో కూడా అక్రమంగా మట్టిని తవ్వుతూ లక్షల రూపాయలు వెనకేసుకొస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ మట్టిని తవ్వేస్తుంటే రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణంగా ఉందని ప్రజలు ఆరోపించారు. అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని రెవిన్యూ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
ప్రైవేటు భూముల్లోనూ మట్టి తన్నుకుపోతున్న వైసీపీ గద్దలు- ప్రశ్నిస్తే బెదిరింపులు - Gravel mining