ICICI Naresh Selfie Video Viral : ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ ఐసీఐసీఐ బ్యాంకుల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాను మోసపోయానంటూ ఐసీఐసీఐ పూర్వ మేనేజర్ నరేశ్ సెల్పీ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని, ఉన్నతాధికారులు సహా బ్యాంకు సిబ్బంది అంతా తననే తప్పు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఖాతాదారులను మోసం చేసే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చిన నరేశ్, బంగారం రుణాలకు సంబంధించి కొంతమంది పేర్లు మార్చామని, మోసం చేయలేదని సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. ఖాతాదారులకు ప్రతినెలా వడ్డీ సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నానని, ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అతను తెలిపారు. విజయవాడ భారతీనగర్ బ్రాంచికి వెళ్లిన అనంతరం రెండు, మూడు నెలల నుంచి జడ్.ఎం. సందీప్ మెహ్రా వల్ల ఇబ్బంది పడుతున్నట్లు నరేశ్ చెప్పుకొచ్చారు. నరసరావుపేటలోని కరుణాకర్, చిలకలూరిపేటలోని హరీశ్‌కు అంతా ఈ విషయం కోసం తెలుసునన్నారు. కానీ తనను మాత్రం దోషిగా నిలబెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
అధికారుల ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నానని భార్య, పిల్లలను చూసి ఆలోచన విరమించుకున్నట్లు పేర్కొన్నారు. రావాల్సిన డబ్బు వస్తే సర్దుబాటు చేసి తప్పుకోవాలనుకున్నానని, కానీ తనను పూర్తిగా మోసం చేశారని వీడియోలో వాపోయారు. అందరూ డబ్బు తీసుకున్నారని, కానీ తనను మాత్రమే తప్పుపడుతున్నారన్న నరేశ్, ఇక తనకు బతకాలని లేదని, చనిపోదామనుకుంటున్నానని చెప్పాడు.
పలువురి పేర్లు వెల్లడి :
ఇంకా వీడియోలో విజయవాడ భారతీనగర్ బ్రాంచిలో ఆర్.ఎస్.చంద్రశేఖర్, ఏలూరు రోడ్డు ప్రవీణ్ డబ్బులు తీసుకున్నారని, వంశీ నరసరావుపేటలోని తన హౌస్‌లోనే ఉంటున్నట్లు తెలిపారు. ప్రతి లావాదేవీ బ్యాంకు నుంచి డైరెక్ట్‌గా జరిగినట్లు తెలిపారు. సింగ్ అకౌంట్‌కు కూడా డబ్బులు వెళ్లాయన్నారు. తనకు జంగారెడ్డిలో కంచర్ల విష్ణుప్రసాద్, పులిపాక ఉమా మహేశ్వరరావు రూ.5 నుంచి 6 కోట్లు వరకూ ఇవ్వాలన్నారు. సీఎస్‌ఆర్, టీపీఎఫ్ లావాదేవీలు పూర్తయితే ప్రభుశేఖర్, కిరణ్ అన్ని క్లియర్ చేస్తారని తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.
ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud