Boppana Radhamma Helping Poor People : ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన బొప్పన రాధమ్మ బాల్యంలోనే పోలియో బారిన పడ్డారు. వైకల్యం వేధించినా చదువు మాత్రం కొనసాగించారు. కష్టపడి చదివి ఆర్టీసీ ఆసుపత్రిలో 19 ఏళ్ల పాటు ఫార్మసిస్టుగా పనిచేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో ఉద్యోగం మానేశారు. ఖాళీ సమయంలో ఏం చేయాలా అని ఆలోచించి, తన పరిస్థితి దృష్ట్యా ఆన్‌లైన్‌లో చీరల వ్యాపారం చేయవచ్చని భావించారు. అనుకున్నదే తడవుగా ఆలోచనను ఆచరణలో పెట్టారు.
రాధమ్మ తన సమయాన్ని, శక్తిని వ్యాపారం కోసం వెచ్చించారు. క్రమంగా ఆదాయం పెరిగింది. దీంతో పాటుగా యూట్యూబ్‌లో ఒక ప్రత్యేక ఛానల్‌ను ఏర్పాటు చేసి వీడియోలు పెట్టారు. అలా వచ్చిన డబ్బులతో సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. ఓ రోజు మంచానికే పరిమితమైన భర్తకు అన్నీ తానై సేవలు చేస్తున్న కుమారి అనే మహిళ దీనగాథ చూసి ఆమె చలించిపోయారు. భర్తకు సేవలు చేస్తూనే బతుకు బండిని లాగడానికి ఆ మహిళ పడుతున్న కష్టాలను చూసి కదిలిపోయారు.
అంబులెన్స్‌కు డబ్బులేక భర్త మృతి.. అలా ఎవరికీ కాకూడదని ఆమె ఏం చేసిందంటే?
ఇవ్వడంలోనే తృప్తి అంటున్న రాధమ్మ : ఆమె భర్తకు చక్రాల కుర్చీతో పాటు కుమారి వ్యాపారం చేసేందుకు ఓ టిఫిన్ సెంటర్ బండి, కావాల్సిన సామగ్రి, కొన్ని సరుకులను రాధమ్మ కొనిచ్చారు. ఈ సంఘటన ఇచ్చిన తృప్తితో ఆమె ఆలాంటి వారికి మరికొంత మందికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికి 150 మందికి పైగా దివ్యాంగులకు వీల్ ఛైర్లు పంపిణీ చేసి సేవా నిరతిని చాటుకున్నారు. ఇందుకోసం పూర్తిగా తన సంపాదనే వినియోగించారు తప్ప ఎవరి వద్దా పైసా తీసుకోలేదు. ఇవ్వడంలోనే తృప్తి ఉంటుందని, అది ఒకసారి రుచి చూస్తే ఆ ఆనందం కోసం మళ్లీ మళ్లీ సేవ చేస్తామంటారు రాధమ్మ.
సేవా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో : తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో రాధమ్మ పోస్ట్ చేస్తున్నారు. తద్వారా వాటిని చూసి మరికొందరు స్ఫూర్తి పొందుతారని ఆమె భావన. అంతేకాకుండా ఆ తరహా సాయం అవసరమైన వారు తనను సంప్రదిస్తారని చెబుతున్నారు. పేదవారికి సాయం చేస్తూ, ఒంటరి అన్న భావన వదిలి విశాలమైన సేవా ప్రపంచాన్ని సృష్టించారు. మంచానికే పరిమితమైనా తన పని తాను చేసుకుంటూ రోజుకు 15 గంటలు కష్టపడతూ, దివ్యాంగులకే కాదు సాయానికి అర్హులైన వారందరికీ తన చేతనైనంత సాయం చేస్తున్నారు రాధమ్మ.
సాధారణ మనుషులకు, దివ్యాంగులకు చాలా తేడా ఉంటుంది. రోజువారి పనులను చేయటానికి కూడా చాలా కష్టపడుతుంటారు. కానీ రాధమ్మ మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. తనకు సంబంధించిన ప్రతి పనిని తానే చాలా క్రమశిక్షణతో చేసుకుంటూ, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, నడవలేకున్నా ఆరు పదుల వయసులో కూడా ఎంతో చలాకిగా పనిచేస్తున్నారు. దీనికి పనిలోనే ఆనందం అని నమ్మి 80 ఏళ్లు దాటినా నిరంతరం శ్రమించే తన తండ్రే తనకు స్ఫూర్తి అంటారు రాధమ్మ. నిరాడంబరంగా జీవిస్తూ నిర్విరామంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారి సేవలను చూశాక ప్రశంసించకుండా ఉండలేం.