Huge Amount of Money Seized in Telangana Today : సార్వత్రిక ఎన్నికల వేళ బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లో రూ.లక్షకు మించి జమ, విత్ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది.
రూ.లక్షకు మించి జమ, డిపాజిట్ చేసిన అభ్యర్థి లేదా కుటుంబసభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని సీఈసీ తెలిపింది. రూ. 10 లక్షల జమ, డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని ఆదేశించింది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించుకోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు ఇవ్వాలని సూచించింది.
సార్వత్రిక ఎన్నికల బడ్జెట్ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్!
Cash Seized in Hyderabad : ఈసీ ఆదేశాలతో రాష్ట్రంలో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 25లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కాచిగూడ కూడలిలోని తారకరామ థియేటర్ వద్ద గోషామహల్ ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు సోదాలు చేపట్టాయి. బర్కత్‌పురాకు చెందిన అనూప్ సోనీ తన ద్విచక్రవాహనంపై సికింద్రాబాద్ నుంచి వస్తుండగా అతణ్ని ఆపారు.
Vehicle Checking in Telangana : అనంతరం అనూప్ బైక్‌ను సోదా చేయగా అతడి వద్ద రూ. 25లక్షల నగదు బయటపడింది. డబ్బుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్మును సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తదుపరి విచారణ కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు నల్గొండ జిల్లా దామెరచర్ల మండలం వాడపల్లి ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.9.50 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు, కారులో తీసుకెళ్తున్న సరైన పత్రాలు లేని రూ. 84 వేలు సీజ్ చేశారు.
అమల్లోకి ఎన్నికల కోడ్ - నిఘా పెంచిన ఈసీ - ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు
ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు- జూన్ 4న కౌంటింగ్- పూర్తి షెడ్యూల్ ఇదే