How to Make Tirumala Laddu Prasadam : ప్రపంచంలో ఇతరులు అనుకరించడానికి వీలులేకుండా భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు ఉన్న ఏకైక లడ్డూ తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ. అంటే తిరుమలేశుని లడ్డూ తయారీ పద్ధతిని ఎవరూ కాపీ కొట్టకూడదని దీనర్థం. తిరుమల ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకూ ఇప్పుడు లడ్డూకు ఉన్న స్థానం అప్పట్లో వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి నైవేద్యవేళలు (సంధి నివేదనలు) ఖరారు చేశారు. ఆ సమయాల్లోనే తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదాలు పంచేవారు.
తిరుమలేశుని ప్రసాదంగా లడ్డూ : ఆరోజుల్లో వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్త జనులకు భోజన సదుపాయాలు లేవు. ఈ ప్రసాదాలు స్వీకరించే భక్తులు తమ ఆకలిని తీర్చుకునే వారు. వాస్తవానికి ఆంగ్లేయుల పాలనలో తిరుమల ఆలయ నిర్వహణను మహంతులు పర్యవేక్షించే వారు. వారు 19వ శతాబ్ది మధ్య భాగంలో ప్రసాదాల్లో తీపి బూందీని ప్రవేశపెట్టారు. 1940 నాటికి క్రమేపి ఆ తీపి బూందీ కాస్త లడ్డూగా రూపాంతరం చెందింది. కాలక్రమంలో "వడ" స్థానంలో "లడ్డూ" పూర్తి స్థాయి ప్రసాదమైంది.
"లడ్డూ" పేరు వెనక ఇంత స్టోరీ ఉందా : సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టీకము అని, తెలుగులో అడ్డుకము, లడ్వము, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక అని పిలుస్తారు. 12వ శతాబ్దికి చెందిన "మానసోల్లాస గ్రంథం"లో వీటి ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. హిబ్రూలో LUD అనే పదంను లడ్డూకు సమానార్ధకంగా వాడుకలో ఉంది. ముద్దగా చేయడాన్నే "లడ్డు"గా పేర్కొన్నారు. లడ్డు పేరు వెనుక ఇంత కథ ఉందన్నమాట.
లడ్డూ తయారీ శాల-పోటు:
- తిరుమలలో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల)కు ముందు వకుళామాత విగ్రహాన్ని నెలకొల్పారు.
- వాస్తు ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలను తయారు చేస్తారు.
- అలా తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని మాతృమూర్తి వకుళామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు.
- అక్కడ వకుళామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడమనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది.
- లడ్డూ, వడలు తదితర ఫలహారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారు చేస్తారు.
- ఆ ఫలహారాలను కూడా వకుళామాతకు చూపించిన తర్వాతే ఆ స్వామివారికి నైవేద్యంగా అందిస్తారు. 1940 ప్రాంతంలో కల్యాణం మొదలైనప్పుడు మనం చూస్తున్న లడ్డూ తయారీ మొదలైంది.
- ఈ లడ్డూ తయారీకి ప్రత్యేక పద్దతి అంటూ ఒకటి ఉందండోయ్.
దిట్టం : శ్రీనివాసుని ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే వస్తువులు, సరుకుల మోతాదును "దిట్టం" అని పిలుస్తారు. మొదటి సారిగా తిరుమల తిరుపతి పాలక మండలి 1950లో దిట్టంను నిర్ణయించారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా దిట్టాన్ని క్రమంగా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని టీటీడీ అనుసరిస్తుంది. దీనినే పడితరం దిట్టం స్కేలుగా కూడా వ్యవహరిస్తున్నారు. పడి అంటే అర్థం 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువులను "దిట్టం"గా ఉంచుతారు.
ఆ విధంగా ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులను సమకూర్చుతారు. వాస్తవానికి మొదట్లో 5100 లడ్డూలు మాత్రమే తయారు చేసే వారు. తదనుగుణంగా కావాల్సిన దిట్టాన్ని కిలోల్లో సమకూర్చేవారు. తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిన తర్వాత అంటే 2001లో ఈ దిట్టంను సవరించారు. 2001 దిట్టం స్కేలు ప్రకారమే లడ్డూలను ఇప్పటికీ తయారు చేస్తూవస్తున్నారు. 5100 లడ్డూల తయారీకి గాను 803 కేజీల సరుకులను వాడతారు. అంటే 803 కేజీల వివిధ రకాల సరుకులతో 5100 లడ్డూలు తయారు చేస్తారు.
దిట్టంలో ఏయే సరుకులు ఉంటాయంటే :
- ఆవు నెయ్యి - 165 కిలోలు
- చక్కెర - 400 కిలోలు
- శెనగపిండి -180 కిలోలు
- ఎండు ద్రాక్ష - 16 కిలోలు
- యాలకులు - 4 కిలోలు
- కలకండ - 8 కిలోలు
- ముంతమామిడి పప్పు - 30 కిలోలు
ఈ విధంగా ఒక దిట్టం నుంచి సుమారు 5100 లడ్డూలను తయారు చేస్తున్నారు. తొలినాళ్లలో ఈ లడ్డూను కట్టెల పొయ్యి మీద చేసేవారు. అయితే పొగ, కట్టెల కొరతను దృష్టిలో ఉంచుకుని పొయ్యిల స్థానంలో ప్రస్తుతం యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ లడ్డూ తయారీ పోటులో ఇప్పుడున్న అత్యాధునిక వంట సామాగ్రిని వినియోగించి రోజూ లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు.
తిరుమల లడ్డూ వివాదం - రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు - TIRUMALA LADDU CONTROVERSY