How To Get Lost Money in Cyber Frauds : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు తమ పంథా మారుస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొద్ది, నేరగాళ్లు కొత్తదారులను వెతుకుతున్నారు. అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. 'మీ పేరు మీద వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయి' అంటూ కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల నుంచి ఫోన్ చేస్తున్నట్లు మాట్లాడతారు. అనంతరం అమాయకుల బలహీనతలను ఆధారంగా చేసుకొని లక్షల్లో కొల్లగొడుతారు.
సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అకస్మాత్తుగా వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానిజాలు గుర్తించే లోపే సైబర్ నేరగాళ్లు ఖాతాల్లోని సొమ్మంతా ఖాళీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నా, కొత్త తరహా ఎత్తులతో మోసాలకు తెగబడుతున్నారు. ఈ సంవత్సరం ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరు వాడుకొని విదేశాల నుంచి డ్రగ్స్, నల్లధనం, ఆయుధాలు వచ్చాయని బెదిరిస్తూ అమాయకులనుంచి భారీగా దొచుకుంటున్నారు. ఇలాంటి కేటుగాళ్ల మాటలకు బెదరకూడదని టీజీ సైబర్‌క్రైమ్ బ్యూరో పోలీసులు సూచిస్తున్నారు.
"కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమంటూ వారు చెప్పే ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకుఖాతా వివరాలు వాస్తవమైనవిగా ఉంటున్నాయి. తమ ఇంటి చిరునామా, కుటుంబసభ్యుల వివరాలు అన్ని సరిపోతున్నాయి. వీడియోకాల్ ద్వారా తాము సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ, కస్టమ్స్ కార్యాలయాల నుంచి మాట్లాడుతున్నట్టు అమాయకులను నమ్మిస్తున్నారు.
ఆఫిస్ గోడలపై కేంద్ర విచారణ సంస్థల లోగోలు, డ్రెస్ ధరించిన టెలీకాలర్స్ కనిపించటంతో బాధితులే తేలికగా వారి బుట్టలో పడుతున్నారు. విచారణ పూర్తయేంత వరకూ ఇల్లు కదలకూడదని ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు అయోమయానికి గురిచేస్తున్నారు." అని టీజీ సైబర్‌సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కె.వి.ఎం.ప్రసాద్ తెలిపారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని చెబుతున్నారు. ఈ ఏడాది 177 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 592మంది నుంచి సుమారు రూ. 44 కోట్లు దోచుకున్నారని చెప్పారు.
సైబర్ ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే
- గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల పేర్లతో వచ్చే ఫోన్లకు స్పందించవద్దు.
- టెలీకాలర్స్ చెబుతున్న వివరాలన్నీ ఖచ్చితంగా ఉన్నట్టు భావించినా భయాందోళనకు గురికావొద్దు.
- వీడియోకాల్‌లో అటువైపు కనిపించే కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలన్నీ నకిలీవే.
- ముఖం కనిపించకుండా మాట్లాడేది మోసగాళ్లని గ్రహించాలి.
- మీకు వచ్చే తెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్, సందేశాలు, లింకులను పట్టించుకోవద్దు.
- మోసపోయినట్టు గుర్తించగానే గంటలోపు(గోల్డెన్ అవర్) పోలీసులకు/1930 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.