How to Find Eligible for Indiramma Housing Scheme in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని తీసుకుంది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో జరిగిన దందాను నిలిపి వేస్తూ కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. అయితే అధికారులు పథకంలో అర్హులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వాటికి 82.82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్హులైన వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేయాలని స్పష్టం చేయడంతో అధికారులకు అర్హులను గుర్తించడం తలకు మించిన భారంగా మారింది.
ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందస్తుగా కొంత మొత్తాన్ని వెచ్చించాలి. ఎందుకంటే ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆధారంగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదవారికే ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేయడంతో అధికారులు వారి ఆర్థిక స్తోమతను అంచనా వేయడంలో తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం వారికి పెద్ద సవాల్‌గా మారింది. ఇళ్ల కేటాయింపులో మాత్రం ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇళ్లను నిర్మించనున్నారు. దసరా పండగ నాటికి కొన్ని జిల్లాల్లోనైనా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచనలో ఉంది.
కానీ మూడు నెలల వ్యవధిలో లబ్ధిదారుల ఎంపిక సాధ్యమయ్యేనా అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియకు కనీసం ఐదు నెలలు సమయం అయినా పడుతుందని అభిప్రాయపడుతున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉందని, ఈ పథకానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం ఉన్నాయి. కానీ బడ్జెట్లో మాత్రం సుమారు రూ.7,500 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఆ రెండు రాష్ట్రాల్లో అధ్యయనం : పలు రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అనుసరించిన తీరుతెన్నులను అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆ మేరకు అధికగారులు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ఎంపిక చేశారు. అయితే ఆయా ప్రక్రియలను చూస్తున్న అధికారులు బదిలీ కావడంతో పనులు వేగం అందుకోలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్‌ను నియమించింది. దీంతో ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేయడానికి మార్గం సుగమమైంది. అక్కడకు వెళ్లి సమాచారం సేకరించిన తర్వాత ఆ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలా? వద్దా? అన్నది కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయిస్తారని ఉన్నతాధికారి చెప్పారు.
భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి