How to Use Electronic Voting Machine : ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు వచ్చే అతిపెద్ద పండుగ ఓటు. అటువంటి ప్రజాస్వామ్య పండుగలో మన ఓటు హక్కును విధిగా వినియోగించుకోవటం ఒక పౌరుడిగా మన కర్తవ్యం కూడా. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా, ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. అదేస్థాయిలో ఐదేళ్ల పాటు తన ప్రతినిధిగా కొనసాగే నేతను ఎన్నుకునేందుకు వేసే ఓటుపై ఓటరుకు ఎలాంటి అనుమానం ఉండొద్దు.
పోలింగ్ కేంద్రం వద్ద వరుసలో నిల్చొని, కేంద్రంలోనికి వెళ్లాక ఈవీఎం (ఎలక్ట్రానికి ఓటింగ్ మెషిన్)పై ఉన్న ఏదో ఒక మీట నొక్కి వచ్చేస్తే సరిపోదు. తాను వేసిన ఓటు, తాను వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్న సందేహానికి తావులేకుండా నిర్ధారించుకోవడం అవసరం. ఇందుకోసం పోలింగ్ ప్రక్రియలో జవాబుదారీ విధానాన్ని ఎన్నికల సంఘం అవలంభిస్తోంది.
Vote Importance in Democracy : తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటరు నిర్ధారించుకునేందుకు వీలుగా ఓటింగ్ స్లిప్ (వీవీ ప్యాట్)ని ప్రదర్శిస్తోంది. అయితే ఇటీవల కర్ణాటకలో జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియపై ఓ ఓటరు అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
ఓటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకమని, దీనిపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు చైతన్యం కల్పించేందుకు డెమో (నమూనా) ప్రదర్శించాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను ‘ఈనాడు - ఈటీవీ భారత్’ కోరింది. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కేంద్రంలో అధికారులు నమూనా (మాక్) పోలింగ్ విధానాన్ని ప్రదర్శించారు. ఈవీఎంలు ఎలా పని చేస్తాయి, ఓటర్లు తాము వేసిన ఓటును ఎలా పరిశీలించుకోవచ్చో పూర్తిగా వివరించారు.
ఓటరు చీటీ, ఐడీ కార్డుతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాక, మొదట పోలింగ్ అధికారి -1 వద్దకు వెళ్లాలి. ఓటరు వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల లిస్ట్‌లో పరిశీలిస్తారు. ఓటరు పేరు, జాబితాలో వరుస సంఖ్యను బిగ్గరగా చదువుతారు. ఆ కేంద్రంలో పార్టీల వారీగా ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఆ ఓటరు పేరు, నంబరును తమ వద్ద ఉన్న ఓటరు లిస్ట్‌లో సరిచూసుకుంటారు.
అనంతరం పోలింగ్ అధికారి-2 వద్దకు ఓటరు వెళ్లాలి. అతని వద్ద ఉన్న స్లిప్‌లోని వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న రిజిస్టర్‌లో సరిచూసుకుని, సంతకం తీసుకుంటారు. ఒకవేళ ఓటరు నిరక్షరాస్యులైతే వేలిముద్ర తీసుకుంటారు. ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. శాసనసభ, లోక్‌సభ స్థానాలు రెండింటికీ ఎన్నికలు జరిగేచోట ఓటర్లకు ఎన్నికల అధికారులు రెండు వేర్వేరు రంగుల స్లిప్పులు ఇస్తారు. వాటి ఆధారంగా రెండు బ్యాలెట్ యూనిట్లలో వారు ఓటు హక్కు వినియోగించుకుంటారు.
అక్కడి నుంచి ఓటరు పోలింగ్ అధికారి-3 వద్దకు వెళ్లాలి. ఆ అధికారి ఓటరు వద్ద ఉన్న చీటీని పరిశీలిస్తారు. తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్‌లో మీట నొక్కి, ఓటును విడుదల చేస్తారు. (ఓటు రిలీజ్ చేయకముందు కంట్రోల్ యూనిట్‌పై ఎడమవైపు ఆకుపచ్చ రంగు ఎల్‌ఈడీ బల్బు వెలుగుతూ ఉంటుంది. ఓటు రిలీజ్ చేశాక కుడివైపు రెడ్ లైట్ వెలుగుతుంది. దీన్ని ఓటరు చూడవచ్చు.) లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే రెండు కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే : ఆ తరువాత బ్యాలెట్ యూనిట్ వద్దకు ఓటరు వెళ్లాలి. ఈ యూనిట్ పైభాగంలో ఆకుపచ్చని ఎల్‌ఈడీ బల్బు వెలుగుతూ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్‌పై అతికించిన బ్యాలెట్ కాగితంపై తాను ఓటేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు పక్కనే ఉన్న మీటను నొక్కాల్సి ఉంటుంది. మీటను నొక్కగానే, దాని పక్కనే ఉన్న బాణం గుర్తులో రెడ్ కలర్ లైటు వెలుగుతుంది. బీప్ సౌండ్ వస్తుంది. బ్యాలెట్ యూనిట్‌పై ఉన్న గ్రీన్ కలర్ లైటు ఆరిపోతుంది. బ్యాలెట్ యూనిట్‌పై సమీపంలోనే ఉన్న వీవీప్యాట్ యంత్రంలో ఒక స్లిప్ కనిపిస్తుంది.
అందులో ఓటరు ఓటు వేసిన పార్టీ సింబల్, అభ్యర్థి పేరు కనిపిస్తాయి. ఈ చీటీ ఏడు క్షణాలపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత దానికి అమర్చిన డబ్బాలో పడిపోతుంది. దాన్ని పరిశీలించి, తాను వేసిన ఓటు సరిగ్గా పడిందా, లేదా అన్నది ఓటరు నిర్ధారించుకోవచ్చు.
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేరువేరుగా ఓటు వేయాల్సి ఉంటుంది.
పోలింగ్ టైం ముగిశాక కంట్రోల్ యూనిట్‌పై ఉన్న క్లోజ్ అనే మీటను అధికారులు నొక్కుతారు. వెంటనే పడిన ఓట్లు, అభ్యర్థుల సంఖ్య యూనిట్‌పై ఉన్న స్క్రీన్‌లో చూపిస్తాయి. పోలింగ్ ముగిసినట్లు అని కూడా కనిపిస్తుంది. అనంతరం పోలింగ్ బూత్ ఏజెంట్ల సమక్షంలో ఆ యూనిట్‌కు ఓ బాక్సులో పెట్టి సీల్ వేస్తారు. ఈ సందర్భంగా పోలింగ్ ఆఫీసర్లు, బూత్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఈ కంట్రోల్ యూనిట్లను, వీవీ ప్యాట్ మెషిన్లను కౌంటింగ్ చేపట్టేవరకు భద్రపరుస్తారు.
బ్యాలెట్ టు ఈవీఎం-75 ఏళ్ల ఎలక్షన్ కమిషన్ ప్రయాణం- ఆసక్తికర విషయాలివే!