House Registrations Increases in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆగస్టులో గృహాల రిజిస్ట్రేషన్లు 17 శాతం అధికంగా జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఇళ్ల విక్రయాలు విలువతో పోలిస్తే ఈ ఏడాది 17 శాతం అధికం. గృహాల రిజిస్ట్రేషన్లను తీసుకుంటే ఒక్క శాతం తగ్గింది. ఆగస్టు 2023లో 6493 ఇళ్లు రిజిస్ట్రేషన్లు కాగా 2024లో 6439 మాత్రమే అయ్యాయి. రిజిస్ట్రేషన్లు జరిగిన గృహాల సంఖ్య ఈ ఏడాది తక్కువైనా ధరలు పెరగడంతో విలువ పెరిగింది.
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.33,641 కోట్లు విలువైన 54,483 గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గృహాల సంఖ్యలో 18 శాతం, విలువలో 41 శాతం లెక్కన వృద్ధి నమోదైంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో పురోగతి కనిపిస్తోంది. యాభై లక్షలు లోపు విలువైన గృహాలు అమ్మకాలు ఏకంగా 13 శాతం తరుగుదల నమోదు కాగా యాభై లక్షల నుంచి కోటి మధ్య విలువైన ఇండ్ల రిజిస్ట్రేషన్లు 9 శాతం వృద్ధి సాధించాయి.
బంజరాహిల్స్ హవా : గత నెల రిజిస్ట్రేషన్లలో అత్యధిక విలువ కలిగిన ఐదు స్థిరాస్తులు బంజారాహిల్స్‌లోనే జరిగాయి. 3 వేల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణంలో గల ఇళ్లు ఐదు రిజిస్ట్రేషన్ జరిగాయి. వీటి బయట మార్కెట్ విలువ ఒక్కోటి రూ.5.37 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.7.78 కోట్ల వరకు ఉన్నాయి. బంజారాహిల్స్‌ను మించి ఐటీ కారిడార్ కోకాపేట ప్రాంతాల్లో ప్రతినెల భారీ మొత్తం విలువ కలిగిన రిజిస్ట్రేషన్లు నమోదయ్యేవి. ఈసారి మొదటి ఐదు లావాదేవీల్లోనూ కోకాపేటకు అసలు చోటు దక్కలేదు.
1000-2000 చదరపు అడుగుల మధ్యలోనే : ఇక కోటి రూపాయలకు మించి విలువైన ఇళ్లు ఏకంగా 61 శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గృహాల రిజిస్ట్రేషన్లు ఏకంగా 17 శాతం పడిపోయాయి. వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 69 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి.
రెండు వేలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లు 14 శాతం అధికంగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. దీని ఆధారంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఎక్కువ విస్తీర్ణం కలిగిన గృహాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వెయ్యిలోపు విస్తీర్ణం కలిగిన ఇళ్లకు నానాటికి డిమాండ్ తగ్గిపోతోంది. వెయ్యి నుంచి రెండు వేల మధ్య చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లకు అధిక డిమాండ్ ఉంది.
ధరల పెంపు నిర్ణయం వాయిదాతో తగ్గుముఖం : రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలను సవరిస్తుందనే ప్రచారంలో భాగంగా జులైలో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రికార్డు స్థాయిలో 8781 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగాయి. పెంపు వాయిదా పడటం వల్ల ఆగస్టులో 27 శాతం తగ్గి 6439 మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయి. జనవరి తర్వాత అత్యంత తక్కువ లావాదేవీలు జరిగింది ఆగస్టులోనే.
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు - మరి డిమాండ్ ఉందా అంటే? - House Price Hike in Hyderabad