Hit Onion Crop in Kurnool District : రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లి పంటను సాగు చేస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 87వేల 500 ఎకరాలు కాగా ఏటా సరాసరిన 5.25 లక్షల టన్నుల దిగుబడులు వస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇప్పటి వరకు కేవలం 20వేల 400 ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేశారు.
రైతన్నలకు తీవ్ర నిరాశ : గత ఐదు సంవత్సరాలల్లో ఇదే అతి తక్కువగా సాగు విస్తీర్ణం. ఫలితంగా దిడుబడులు భారీగా పడిపోయాయి. మహారాష్ట్రలో జూలై చివర్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలోనూ ఉల్లి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. కర్నూలు జిల్లాలోనూ దిగుబడులు తక్కువగా ఉండటంతో మంచి ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ మార్కెట్లో ధరలు తక్కువ పలకడంతో రైతన్నలకు తీవ్ర నిరాశ తప్పటం లేదు. క్వింటా కనిష్ఠ ధర 5 వందలు, గరిష్ఠ ధర 3వేల 800, మధ్యస్థ ధర 3వేల 500 రూపాయలు పలుకుతోంది.
సగానికి సగం తగ్గిపోయిన దిగుబడులు : ఖరీఫ్ ఆరంభంలో లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు పంట చేతికందే సమయంలో భారీ వర్షాలు కురవటంతో కోతలు మొదలు పెట్టక ముందే పొలాల్లో ఉల్లి కుళ్లిపోయి దిగుబడులు తగ్గిపోయాయి. ఫలితంగా ఎకరాకు 50 నుంచి 60 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చింది. కర్నూలు ఉల్లి మార్కెట్లో సరాసరిన 15 వందల నుంచి 17 వందల వరకు ధరలు పలుకుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దిగుబడులు సగానికి సగం తగ్గిపోయాయని, ఇప్పుడు ఉన్న ధరలతో పెట్టుబడులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పంట పాడైపోయింది. దిగుబడి చాలా వరకు తగ్గింది. ఉల్లి ధర కూడా ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. రైతులకు మద్దతు ధర రావడం లేదు. పెట్టుబడికి అధిక మొత్తంలో ఖర్చు చేశాం. ప్రస్తుతం ఆ ఖర్చులు కూడా వచ్చేలా లేవు. చాలా నష్టపోయాం." - ఉల్లి రైతులు
బుడమేరు వరదతో పత్తి పంట నాశనం - ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతులు - COTTON CROP DAMAGE DUE TO FLOODS