High Court on Neha Reddy Illegal Construction at Bhimili Beach : విశాఖ జిల్లా భీమిలి బీచ్‌లో సీఆర్‌జెడ్ (CRZ -coastal Regulation Zone) జోన్ నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలను ఆపవద్దని జీవీఎంసీ (GVMC)కి సూచించింది. నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు లేవని మీ పనిని మీరు చేయాలని తెలిపింది.
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రపు నీటికి అతి సమీపంలో సీఆర్‌జడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి కాంక్రీట్ ప్రహరీ నిర్మించడాన్ని సవాలు చేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది. నేహారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సీఆర్‌జడ్-2 పరిధిలో మాత్రమే నిర్మాణాలు చేశామని, సీఆర్‌జడ్ 1 పరిధిలో కాదని చెప్పారు. ధర్మాసనం సూచించిన నేపథ్యంలో ఇప్పటికే కూల్చివేతకు అయిన ఖర్చు చెల్లించాలని అధికారులు తమను కోరుతున్నట్లు తెలిపారు. రాజకీయ కక్షతో పిల్ దాఖలు చేశారన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ ‘కోర్టు ముందున్న ఫొటోలను పరిశీలిస్తే సీఆర్‌జడ్-2 పరిధిలోకి వచ్చే ప్రాంతంలో నిర్మాణాలు చేస్తున్నట్లు కనిపించట్లేదు. సముద్రానికి అతి సమీపంలో ప్రహరీ నిర్మించారు. నిర్మాణాల అనుమతులు, ఇతర అంశాలను సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యంలో తేల్చుకోవాలి’ అని సూచించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ మొత్తం విస్తీర్ణం విషయంలో వివరణ కోరుతూ నేహారెడ్డికి తాజాగా షోకాజ్ నోటీసు ఇచ్చామని, దానిపై ఆమె స్పందించలేదని అందుకే స్థాయీనివేదికను కోర్టు ముందు ఉంచడంలో జాప్యం జరుగుతోందన్నారు. మరికొంత సమయం కావాలని కోరారు.
అక్రమ నిర్మాణం విషయంలో తీసుకున్న చర్యలతో స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతపై స్టే ఇవ్వాలని నేహారెడ్డి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కూల్చివేత ఖర్చులు ఎవరు భరించారు ? బిల్లులు సమర్పించండి ?: హైకోర్టు - Neha Reddy Illegal Construction
ఎంపీ విజయసాయి రెడ్డి అవినీతి అక్రమాస్తులపై సుప్రీం సీజేఐకి పురందేశ్వరి లేఖ