Former MLA Pinnelli Ramakrishna Reddy Arrest: అరాచకానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని నరసరావుపేటలో పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల వేళ ఈవీఎం ధ్వంసం సహా వివిధ కేసుల్లో గత నెలలోనే ఆయన్ని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉండగా పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో జూన్ ఆరు వరకు ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. కానీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టడం కౌంటింగ్ తంతు కూడా ముగియడంతో తాజాగా ఆయన్ని అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్ని అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు.
పిటీషన్లు రద్దు: ఎన్నికల సమయంలో అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లిపై నమోదైన నాలుగు కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించింది.
పిన్నెల్లి అరాచకం: ఎన్నికల పోలింగ్ రోజు పాల్వయిగేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసం సృష్టించారు. సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు. వీటన్నింటి మీదా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లు జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు పిన్నెల్లి సోదరులు అనేక అరాచకాలకు, దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే స్వయంగా ఈవీఎం ధ్వంసం (EVM Destroyed Case) చేసిన వీడియో సిట్ విచారణలో వెలుగుచూడటం దేశ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పోలింగ్ అనంతరం కూడా నియోజకవర్గంలో పిన్నెల్లి, ఆయన అనుచరులు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ పొందారు. 6వ తేదీ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై పిన్నెల్లి బాధితుడు నంబూరు శేషగిరిరావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తీర్పుతో విబేధిస్తూ పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
మాచర్లలో ఆటవిక పాలనకు తెర- పిన్నెల్లి ఓటమితో ప్రజలకు స్వాతంత్య్రం! - Pinnelli defeat in Macherla