Hero Nara Rohit Engagement Grandly Held in Hyderabad : సినీ నటుడు నారా రోహిత్ దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. ఆదివారం (అక్టోబర్ 14) నిశ్చితార్థం జరిగిన హీరోయిన్ శిరీష (సిరి) స్వస్థలం రెంటచింతల. ఆమె సామాన్య రైతు కుటుంబంలోనే జన్మించింది. పల్నాడు జిల్లా గురజాల మండలం దైదకు చెందిన నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితం గ్రామం విడిచి రెంటచింతల వలస వచ్చారు. నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తూ కష్టపడి తమ నలుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు.
పెద్దమ్మాయి శ్రీలక్ష్మి రెంటచింతలలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పని చేస్తుంటే, రెండో అమ్మాయి భవానీ వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడింది. మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నాలుగో అమ్మాయి శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసింది. అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసింది. అనంతరం సినీరంగంపై అభిమానంతో హైదరాబాద్‌కు వచ్చారు. తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆదివారం హైదరాబాద్‌లో వేడుకగా నిశ్చితార్థం నిర్వహించారు.
హీరో నారా రోహిత్ నిశ్చితార్థం - హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు
నారా రోహిత్, శిరీష(సిరి)ల నిశ్చితార్థం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరై రోహిత్, శిరీషను ఆశీర్వదించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులు, విశాఖ ఎంపీ భరత్ - తేజస్విని దంపతులు, సినీ నటుడు శ్రీవిష్ణు దంపతులు ఈ వేడుకకు హాజరయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. నిశ్చితార్థ కార్యక్రమ ఏర్పాట్లను నారా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు.
ఆ హీరోయిన్‌తోనే నిశ్చితార్థం : 2009లో 'బాణం' సినిమాతో నారా రోహిత్ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 'సోలో' మూవీతో మంచి హిట్ కొట్టిన తర్వాత వరసగా 2018 వరకు పలు సినిమాలు చేశాడు. అందులో సోలో, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి, బాలకృష్ణుడు, మెంటర్ మదిలో, వీర భోగ వసంత రాయలు వంటి చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత సుమారుగా ఆరేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సంవత్సరం మళ్లీ 'ప్రతినిధి-2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'ప్రతినిధి-2' సినిమాలో నటించిన హీరోయిన్‌తోనే నారా రోహిత్ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి పీటలెక్కడానికి సిద్ధపడ్డారు.
ప్రస్తుత పరిస్థితుల్లో.. వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి : నారా రోహిత్