Heavy Rains in AP : అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమలలో టీటీడీ జాగ్రత్తలు చేపట్టింది. కొండచరియలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గూడూరు సబ్‌కలెక్టర్ కార్యాలయం, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కపిలతీర్థం జలపాతం వద్ద భక్తులు స్నానమాచరిస్తూ సందడి చేస్తున్నారు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు : నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. మర్రిపాడు మండలంలోని కేతామన్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు పెన్నా నదికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విడవలూరు మండలంలోని సముద్ర తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగింది. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో కంది పొలాల్లోకి నీరు భారీగా చేరింది. మరో నాలుగు రోజుల పాటు వానలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేస్తుండటంతో రైతులు ఆందోళ చెందుతున్నారు. నీరు ఎక్కువ రోజులు ఉంటే పంట పాడవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రేపల్లె మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చీరాలలో వర్షాల ధాటికి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలోని మురుగు నీరు, వర్షపు నీటితో ప్రవహించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
AP Heavy Rains Updates : కోనసీమ జిల్లాలోని కొన్ని మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కుండపోత వాన కురిసింది. జాతీయ రహదారి 216పై కాకినాడ-అమలాపురం మధ్య వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు విడవని వర్షంతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.