Heavy Rain in Tirumala Due to Fainjal Cyclone in AP : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుపానుగా మారినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. దీనికి ఫెయింజల్‌గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శనివారం కారైకాల్ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటే అవకాశముందని పేర్కొంది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
భక్తుల ఇబ్బందులు: ఫెయింజల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో వర్షం దంచికొడుతుంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు చిరుజల్లులు కురువగా అర్ధరాత్రి వర్షం తీవ్రత ఎక్కువైంది. వర్షంతో పాటు బలంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. తిరుమల అంతట దట్టంగా పొగ మంచు కమ్మేసింది. దీంతో కొండపై చలి తీవ్రత పెరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు దర్శనానంతరం లడ్డూ ప్రసాదం, గదులకు చేరేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు.
టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. ఘాట్ రోడ్డులో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారీ వర్షం దృష్ట్యా పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. భారీ వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఈ మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో ప్రధాన జలాశయాలు నీటి మట్టం పెరిగాయి. దీంతో జలాశయాల వద్ద కూడా నీటి పారుదలశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Chandrababu on Fengal Cyclone : మరోవైపు ఫెయింజల్ తుపాన్పై విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం పేర్కొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో తుపాను - రాష్ట్రంలో భారీ వర్షాలు