Apaar Card Problems in AP : దేశంలోని ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డు ఉంది. ప్రస్తుతం నిత్య జీవితంలో ఆధార్ గుర్తింపు సంఖ్య భాగమైపోయింది. ఈ గుర్తింపు లేనిదే ఏ పనులు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే విధంగా దేశంలోని ప్రతీ విద్యార్థికి 12 అంకెల జీవితకాల గుర్తింపు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆటోమేటెడ్ ఐడీ పర్మినెంట్ ఎకడమిక్ అకౌంట్ రిజిస్టరీ (అపార్) పేరుతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది.
అయితే ఇప్పుడు ఇది రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రలను ఇక్కట్లకు గురిచేస్తోంది. ఇటీవల ప్రభుత్వం అపార్ యాప్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేయడానికి పుట్టినరోజు సర్టిఫికెట్, ఆధార్ కార్డులోనూ పేరు ఒకే విధంగా ఉండాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చాలామంది వివరాల్లో తేడాలు ఉన్నాయి. తండ్రిపేరు, విద్యార్థి పేరు ఒక్కో విధంగా ఉంది. ఒక్క అక్షరం తేడా ఉన్నా ఆధార్‌లో సరి చేసుకోవాల్సినా పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పిల్లల ఆధార్ కార్డులో పేరు అప్డేట్ కోసం వారు పెద్ద ఎత్తున ఆధార్ సెంటర్లకు బారులు తీరుతున్నారు. మరోవైపు సర్వర్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటం కూడా వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
Public Rush at Aadhaar Centers : ఈ క్రమంలోనే అనంతపురంలో ఆధార్ కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు బారులు తీరారు. టోకెన్ కోసం అర్థరాత్రి రెండు గంటల నుంచి పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ యాప్‌లో నమోదుకు తక్కువ సమయం ఇవ్వడంతో ఈ అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఆధార్ కేంద్రాలు పెంచి తమ సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. రెండు, మూడు పర్యాయాలు వెళితే తప్ప మార్చడం వీలవడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
ఎందుకీ కార్డులు : ప్రభుత్వ/ప్రైవేట్ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక ఐడీ నంబరు కేటాయించి అపార్ కార్డులు జారీ చేస్తారు. విద్యార్థి ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ అయినప్పుడు ఈ కార్డు నంబర్ నమోదు చేయగానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించకుండానే నేరుగా పైతరగతికి అప్‌గ్రేడ్ అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటివరకు చాలామంది ఒకే సంవత్సరంలో రెండేసి డిగ్రీలు చేసే వారు. ఇకపై వీలుండదు.
మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉంది సరే - మరి "అపార్" కార్డు ఉందా?
విద్యార్థుల అకడమిక్ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా 'అపార్'