HC Notices to CID Chief Sanjay and Former AG Ponnavolu: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో ఉన్న స్కిల్ కేసుపై మీడియా సమావేశం పెట్టడంపై యునైటెడ్ ఫోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో పిల్ వేశారు. మీడియా సమావేశం పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సంజయ్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
కేసు పూర్వపరాలు... మాజీ సీఎం జగన్‌పై తన భక్తి ప్రపత్తుల్ని చాటుకోవడంలో మాజీ సీఐడీ చీఫ్, మాజీ ఏఏజీ సుధాకర్ రెడ్డి ఏనాడు వెనుకడుగు వేయలేదనే వాదన గత ప్రభుత్వ హయంలో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయిన సమయంలో ఇది మరింతగా మొతాదు పెంచి బహిరంగంగా స్వామి భక్తిని ప్రదర్శించారనే విమర్శలు వ్యక్తమైయ్యాయి. న్యాయ నిపుణులు, రాజకీయ ప్రముఖులు విస్తుపోయేలా వీరు ప్రెస్మీట్లు నిర్వహించిన తీరుపై గతంలో సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
చట్టాలు, న్యాయశాస్త్ర విలువలు, కోర్టుల గౌరవాన్ని దిగజారుస్తూ టీవీ, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే ప్రధాన బాధ్యతగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి పెట్టుకున్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన కేసు కోర్టులో విచారణలో ఉన్న సమయంలో జరిగిందో లేదో తెలియని స్కాంకు చంద్రబాబును బాధ్యుడిగా చెబుతూ ఎక్కడిక్కడ ప్రెస్‌మీట్ పెట్టి ప్రచారం చేశారు.
స్కిల్ కేసులో సంజయ్ పర్యవేక్షణ అధికారి మాత్రమే. దర్యాప్తు అధికారి కాదు. మరి ఆయన ఊరూరా ప్రెస్మీట్లు పెట్టి కేసు వివరాల్ని వెల్లడించడమేంటని ప్రశ్నలు వెల్లువెత్తాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ కేసులోనైనా అలా చేస్తాయా..! అంటూ న్యాయ నిపుణులు ముక్కున వేలేసుకున్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా, ఛార్జిషీటు ఫైల్ చేయకముందే పోలీసులు కేసు వివరాల్ని బహిర్గతం చేయడం నిబంధనలకు విరుద్ధమని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడ్డారు. కేసు దర్యాప్తునకే పరిమితం కావాల్సిన సీఐడీ ఆధారాల్లేవని చెబుతూనే, పలానా వారే తప్పు చేశారనడమేంటనే విమర్శలు వెల్లవెత్తాయి.