Guru Purnima Celebrations In Telangana 2024 : గురుపౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, దిల్‌సుఖ్‌నగర్, వరంగల్‌లోని లయాలకు భారీగా భక్తులు చేరుకుని సాయినాథుడిని దర్శించుకుంటున్నారు. ఇలా పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటున్నారు.
Importance Of Guru Purnima : సమాజంలో గురువుకు ప్రముఖ స్థానం ఉంది. గురువుకు సమాజంలో అత్యత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయంలో భాగంగా వస్తోంది. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా పూజించడమనేది ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తే గురువు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణమిగా నిర్వహించడం మన దేశంలో ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా భావిస్తారు.
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ : గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌లో సాయిబాబా దేవాలయంలో భక్తజనసందోహం నెలకొంది. వేకువజాము నుంచే బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరోవైపు ఖమ్మంలో బాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని బాబా ఆలయాల్లో గురుపౌర్ణమి శోభ కనిపిస్తోంది. నల్గొండలోని సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదిలాబాద్‌లో కూడా గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఆదిలాబాద్‌లో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు : ఆదిలాబాద్ జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శాంతినగర్‌లోని సాయిబాబా ఆలయంలో వేకువ జామున కాగడ హారతితో పూజా మొదలయ్యాయి. తొలుత సాయినాథుని విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబా సేవలో పునీతులయ్యారు. ఆలయ ప్రాంగణమంతా సాయినామస్మరణతో మార్మోగుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వ్యాసమహర్షి వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. జిల్లాలోని బాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మెదక్ జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు : గురుపౌర్ణమి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వేకువజామునుంచే భక్తులు భక్తిశ్రద్ధలతో సాయినాథ నామాలు జపించారు. పల్లకి సేవ, పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమి ఆదివారం సెలవు దినం కూడా కలిసి రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా సాయినాధుడిని దర్శించుకున్నారు.
నల్గొండలో : జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ ముషంపల్లి రోడ్డులోని సాయిబాబా ఆలయం, రామగిరిలోని సాయిబాబా ఆలయాలు సాయినామస్మరణతో మారుమోగాయి. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
నిజామాబాద్‌లో బాబాకు ప్రత్యేక అభిషేకాలు : నిజామాబాద్ జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మాధవనగర్‌లోని సాయిబాబా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు జిల్లాలోని పలు సాయిబాబా ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని సాయిని దర్శించుకున్నారు.
గురుపౌర్ణమి పేరు ఎలా వచ్చిందో తెలుసా! ఆ రోజు ఏం చేయాలి? - GURU POURNAMI 2024 SPECIAL