Government Orders Amaravati Works : రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ప్రతిపాదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. రాజధానిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు 11,467 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది.
ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణంతో : ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల భవనాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఆమోద ముద్ర వేసింది.
ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధుల్ని వెచ్చించాలని నిర్ణయించింది. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయటంతో పాటు శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం సీఆర్డీఏ 1585 కోట్లు వెచ్చించనుంది.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లుతో 1200 అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం 984 కోట్లు కేటాయించింది. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రెయిన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సీవరేజి, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్లు ఏర్పాటు కోసం నిధులను వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 20 సివిల్ పనులకు గాను 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం చేసేందుకు ఆమోదముద్ర వేసింది.
అమరావతి పునర్నిర్మాణానికి ప్రభుత్వం మిషన్ మోడ్ - 15 నుంచి పనులు ప్రారంభం
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి - 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం