YSRCP Leaders Illegal Layouts: అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలోని వివాదాస్పద భూముల్లో వేసిన వెంచర్లలో ప్లాట్లు విక్రయాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అధికారం అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు స్థిరాస్తి దందాకు తెరలేపారు. మాజీమంత్రి అమర్‌నాథ్, వైఎస్సార్సీపీ నేత బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లోనే అక్రమ లేఅవుట్‌లు వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలు తవ్వేసి, కాల్వలు పూడ్చేసి చదును చేశారు.
దీనిపై గత నాలుగేళ్లుగా పెద్దఎత్తున ఫిర్యాదులు అందినా అధికార యంత్రాగం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాలకు అడ్డుకట్టపడింది. విశాఖ నగర ప్రణాళిక విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలు గుర్తించారు. అనుమతులు లేకుండా చేస్తున్న పనులు ఆపేయాలని, బ్రోచర్లతో ప్రచారం చేసి ప్లాట్ల విక్రయించొద్దని వీఎమ్ఆర్డీఏ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని పదేపదే ప్రకటించడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వైఎస్సార్సీపీ నేతలు దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమ లేఅవుట్‌లకు తెరలేపారు. రెవెన్యూ రికార్డుల్లో లొసుగులను ఉపయోగించుకుని వివాదాస్పద భూములు, ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఇచ్చిన ఎసైన్డ్ భూములను వారిని భయపెట్టి లాక్కున్నారు.
'బెదిరించి భూములు లాక్కున్నారు'- మాజీ ఎంపీ ఎంవీవీపై కేసు - CASE FILED ON MVV
కశింకోట మండలం విస్సన్నపేటలో 609 ఎకరాలు తమ గుప్పిట పెట్టుకున్నారు. రైతులతో సెటిల్‌మెంట్లు చేసుకుని వారి పేరిటే మ్యూటేషన్లు చేయించి ఆ తర్వాత వైఎస్సార్సీపీ నేతలు తమ పేరిట జీపీఏ చేసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండానే లేఅవుట్‌లు వేశారు. ఆ తర్వాత వైశాఖి వ్యాలీ మౌంటెన్ విల్లాల పేరిట ప్లాట్లు విక్రయాలకు పెట్టారు.
విజయసాయిరెడ్డి సన్నిహితులు, ఇతర ప్రాంతాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలే పెద్దఎత్తున ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. ఈ లేఅవుట్ పక్కనే ఉన్న భూములను సైతం భయపెట్టి లాక్కున్నారు. ఈ విల్లాలకు వెళ్లే దారి గతంలో 10 అడుగులు ఉంటే ఇప్పుడు ఏకంగా 120 అడుగుల రోడ్డుగా మార్చేశారు. అందుకోసం ప్రభుత్వ భూములు, గెడ్డలు పూడ్చేశారు. వీటిపై రైతులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు గతంలో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మార్నాడే వైఎస్సార్సీపీ నేతలు వాటిని పీకిపడేశారు.
చెట్లు, కొండలను తొలగించడం, దగ్గర నుంచి వాగులు, వంకలు పూడ్చడం వరకు అన్ని ఉల్లంఘనలు జరిగాయి. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ లేఅవుట్‌ను పరిశీలించారు. కూటమి సర్కార్ రాకతో ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. అనుమతులు లేకుండా లేఅవుట్‌లు వేయడంపై నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.