Government 100 Days Action Plan Eradicate Ganja from AP : గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. సచివాలయంలో తొలిసారి భేటీ అయిన మంత్రుల కమిటీ గంజాయి నివారణ, గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నయాలపైనా చర్చించింది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతలు గిరిజనులకు ఇచ్చిన భూముల్లో కాఫీ, మిరియాలు, అల్లం, పసుపు పంటలు పండించకుండా గంజాయిని సాగు చేసేలా ప్రోత్సహించినట్లు గుర్తించారు.
గిరిజనులు గంజాయి సాగుకు దూరంగా ఉండాలని ఈ విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గంజాయి సాగు మొదలుకుని వినియోగం వరకు జరిగే వివిధ ప్రక్రియలను అరికట్టాలంటే క్షేత్ర స్థాయిలోని పోలీసుల సహకారం తప్పనిసరని హోం మంత్రి అనిత ఈ భేటీలో ప్రస్తావించారు. కింది స్థాయి పోలీసులకు గంజాయి విషయాలన్నీ తెలుసని వారు మనస్సు పెడితే దాన్ని అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదని మంత్రి అనిత డీజీపీకి సూచించారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.
ఇసుక, మద్యం, ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోకుండా ఉండేందుకే సెబ్ వంటి వ్యవస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్సు వ్యవస్థను 10 రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారి, జిల్లా స్థాయిలో పర్యవేక్షణలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గంజాయి సాగుకు గిరిజనులు మొగ్గు చూపకుండా వారిని ఆదుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.
గంజాయిని రవాణా చేసే వారిలో గిరిజన యువత ఎక్కువగా ఉన్నారనే ప్రస్తావన మంత్రుల కమిటీ భేటీలో వచ్చింది. వీరిలో చాలా మంది జైళ్లల్లో మగ్గుతున్నారని వీరికి సరైన ఉపాధి లేకే గంజాయి రవాణా వంటి వాటితో ఉపాధి కల్పించుకుంటున్నారనే చర్చ జరిగింది. చాలా మంది గిరిజన యువతకు బెయిల్ వచ్చినా దానికి తగ్గ ష్యూరిటీలు కట్టే స్థోమత లేక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారని మంత్రి సంధ్యారాణి ప్రస్తావించినట్లు తెలిసింది. వీరికి ఐటీడీఏల ద్వారా ష్యూరిటీలు ఇప్పించి వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలిస్తే బాగుంటుందనే ప్రతిపాదనను పెట్టారు. దీనిపై న్యాయ సలహాలు తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించినట్టు సమాచారం.
ప్రకాశం జిల్లాలో గంజాయి అమ్మకాలు-ఆరుగురు అరెస్ట్
గంజాయి డీ-ఎడిక్షన్ సెంటర్లు రిహాబిలిటేషన్ సెంటర్లల్లో మౌలిక వసతులు వైద్యులు కౌన్సిలర్లు సరిగా లేరనే అంశాన్ని మంత్రి సత్యకుమార్ ప్రస్తావించారు. గత ఐదేళ్ల కాలంలో పోలీసు శాఖకు సరైన వాహనాలు లేవని ప్రోటోకాల్ వాహనాలు, డాగ్ స్క్వాడ్ నిర్వహణకు సరైన నిధుల్లేవని పోలీసు ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. కేంద్రం నుంచి వచ్చే నిధులకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని గత ప్రభుత్వ నిర్వాకాన్ని పోలీసు అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం.
గంజాయిని నిర్మూలన దిశగా చర్యలు- మంగళగిరిలో 1.5 కేజీ గంజా సీజ్, ఇద్దరు అరెస్ట్