Government Secretly Moving Power Cables From Amaravati to Vizag : పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాల కోసం అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఎవరి పర్యవేక్షణా ఉండదనే ధీమాతో అధికార వైఎస్సార్సీపీ అస్మదీయ గుత్త సంస్థ మేఘా ఇంజినీరింగ్ రాజధాని అమరావతి నుంచి సామగ్రిని ఇష్టారీతిన తరలిస్తోంది. సీఆర్డీఏ నుంచి అనుమతులు లేకుండానే ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని బరితెగించింది. రాజధాని అమరావతిలో భూగర్భంలో వేసేందుకు నిల్వ ఉంచిన విద్యుత్తు కేబుళ్లను విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ తరలిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ తరలింపు వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది. 4 నెలల కిందట ఇలాగే అనుమతులు లేకుండానే ఆర్థికమంత్రి బుగ్గన చెప్పారంటూ అమరావతి నుంచి నంద్యాల జిల్లా డోన్‌కు రూ.20 కోట్ల విలువైన తాగునీటి పైపులను తరలించేసింది. తాజాగా విశాఖలో ఈ సంస్థ చేపట్టిన పనుల కోసం కేబుల్ డ్రమ్ములను తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కటి సుమారు 500 మీటర్ల నిడివి కలిగిన 220 కేవీ తీగలున్న డ్రమ్ములను భారీ వాహనాల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు.
అడవిలా మారిన అమరావతి ప్లాట్లు - కోర్టులు, అన్నదాతలను మోసం చేస్తున్న సర్కార్
సీఆర్డీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తరలింపు : రవాణా వాహనాల వద్ద ఉన్న కాగితాలను పరిశీలిస్తే వాటిపై డ్రమ్ములు అమ్మడానికి కాదు కేవలం ఒక సైట్ నుంచి మరో సైట్‌కు తరలించటానికే అని రాసి ఉంది. సత్యసాయి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ బిల్లుతో భారీ వాహనాల్లో డ్రమ్ములను తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు దాదాపు 18 డ్రమ్ములు తరలించినట్లు సమాచారం. లింగాయపాలెం నుంచి మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, అచ్యుతాపురం, విశాఖపట్నం అని ట్రాన్స్‌పోర్ట్ బిల్లులో ఉంది. ఇక్కడి సామగ్రిని మరో ప్రాంతానికి తరలించాలంటే సీఆర్డీఏ అనుమతివ్వాలి. దీనికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. డ్రమ్ములను తరలిస్తున్న వాహనాల వద్దకు పోలీసులు శనివారం వచ్చి పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని వదిలేశారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు : రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా విశాలమైన రహదారులు, భూగర్భ విధానంలో విద్యుత్తు నెట్‌వర్క్, తాగునీరు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అండర్‌గ్రౌండ్ డక్ట్‌లను నిర్మించింది. వీటిలో విద్యుత్తు తీగలను ఏర్పాటుచేయాలి. ఈ పనుల్లో ఓ ప్యాకేజీని ఆరేళ్ల కిందట మేఘా సంస్థ దక్కించుకుంది. పనులు ప్రారంభమై, పురోగతిలో ఉన్న సమయంలో ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం రాకతో రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. భారీ విద్యుత్తు తీగలు ఉన్న డ్రమ్ములను మేఘా ఇంజినీరింగ్ సంస్థ రాయపూడి, లింగాయపాలెం గ్రామాల మధ్య కృష్ణా కరకట్ట పక్కన రేకుల షెడ్డు నిర్మించి, నిల్వ చేసింది. ప్రస్తుతం రాజధానిలో నిర్మాణ పనుల కోసం ఉద్దేశించిన సామగ్రిని వేరే ప్రాంతాలకు తరలించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని అమరావతి పరిధి గ్రామాల్లో భూసేకరణ రద్దు - అంతా జగనన్న ప్లానే - Land Acquisition Withdrawal
మధ్య తరగతికి జగనన్న స్మార్ట్ మోసం - అమరావతిలో ప్లాట్లు కొన్నవారికి కష్టాలు - Amaravati Township