Government Planning for Reorganization Irrigation Department : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. కీలకమైన శాఖ కావడంతో పాటు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలు చాలా ఉన్న తరుణంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలకు ముందే మేడిగడ్డ (Medigadda) ఆనకట్ట కుంగిన పరిస్థితుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా విచారణ చేయించి, నీటి పారుదల శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లును విధుల నుంచి తొలగించిన సర్కార్, ఈఎన్సీ జనరల్ మురళీధర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించింది.
వారితో పాటు మరికొందరు ఇంజినీర్లపై కూడా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈఎన్సీ జనరల్‌గా పరిపాలనా విభాగం ఈఎన్సీ అనిల్ కుమార్‌కు, రామగుండం ఈఎన్సీగా జగిత్యాల చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరికొంత మంది ఇంజినీర్లపై కూడా చర్యలు ఉంటాయని ప్రభుత్వం అప్పట్లోనే పేర్కొంది. నీటి పారుదల శాఖపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy), సాగునీటి రంగానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలను కూడా వివరించారు. ప్రాజెక్టులను పనుల ఆధారంగా వర్గీకరించుకొని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే వాటిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
రానున్న ఏడాది కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామన్నారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు నదీ యాజమాన్య బోర్డులతో కలసి పని చేయాల్సిన, పరిష్కరించుకోవాల్సిన పలు అంశాలున్నాయి. ట్రైబ్యునల్, కేంద్రంతో అంశాలు, తదితరాలపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. దీంతో శాఖకు మరో కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. నీటి పారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని మరో ఐఏఎస్(IAS) అధికారిని కూడా శాఖకు కేటాయించారు.
Telangana Irrigation Department Special Secretary : 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్‌ను నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ప్రశాంత్ జీవన్(Prashanth Jeevan Patil) సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. సివిల్ ఇంజినీరైన ప్రశాంత్‌ను నీటి పారుదల శాఖకు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లు సమాచారం. ప్రభుత్వ పరంగా రాహుల్ బొజ్జానే శాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించనుండగా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్‌కు తగిన బాధ్యతలు అప్పగించనున్నారు.
శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు మరో ఐఏఎస్ అధికారిని కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు నీటి పారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణను(Reorganization) కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు ఉంటాయని అంటున్నారు.
గత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని బేషజాలకు పోతున్నారు: నిరంజన్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి