Government Neglect Yanam Obelisk Tower : కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో నిర్మించిన కీలక పర్యాటక ప్రాజెక్టు పడకేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నమూనాలో గిరియాంపేట-సావిత్రినగర్ మధ్య కట్టిన ‘యానాం ఒబిలిస్క్ టవర్’ను నిర్మించారు. దీనికి సరైన నిర్వహణ, ప్రణాళిక లేక ప్రస్తుతం మూలన పడింది. రిలయన్స్ సంస్థ పారిశ్రామిక సామాజిక బాధ్యత కింద 26 కోట్ల రూపాయలతో 333 అడుగుల ఎత్తైన ఈ టవర్‌ను నిర్మించింది. 06-01-2015న అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్, సీఎం రంగస్వామి దీనిని ప్రారంభించారు. పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి సరైన ప్రచారం, ఆకర్షించే ప్రణాళికలు, వసతుల కల్పన లేకపోవడంతో ఈ టవర్ నిరాదరణకు గురైంది.
రూ. కోట్ల నిధులు వృథాయేనా? : 216 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీచినా, 8 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా ఈ టవర్‌ను రూపకల్పన చేశారు. ఈ క్రమంలోనే 67 మీటర్ల లోతు పునాదులతో ఒబిలిస్క్ టవర్ నిర్మించారు. హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రం, ఉద్యానవనం, విద్యుత్తు కాంతులకు 12 కోట్ల రూపాయలు కేంద్ర నిధులను అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి ద్వారా మల్లాడి కృష్ణారావు మంజూరు చేయించారు. 2016లో ఎల్జీగా వచ్చిన కిరణ్‌బేడీ రెండు విడతల్లో నిధులు ఖర్చు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫౌంటైన్లు, లైటింగ్ పనులు చేశారు. మిగిలినవి పనులు మాత్రం సగంలోనే వదిలేశారు.
మనసు పెడితే పర్యాటక హారమే : కాంట్రాక్టర్లు నుంచి స్పందన లేక ప్రభుత్వ పర్యాటక రెస్టారెంటు నిర్వాహకులే టవర్‌ను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలంటే రూ. 10 కోట్లు కావాలని వెల్లడించారు. కేంద్రం గతంలో కేటాయించిన రూ.6 కోట్లు వెచ్చించ లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అవి ఇస్తే పార్కులు, నిర్మాణాలతో ఆహ్లాదకరంగా మార్చొచ్చు అని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మూడోసారి టెండర్లకు పరిపాలన అధికారి ఆర్.మునిస్వామి ప్రయత్నం చేస్తున్నారు.
రవాణా సదుపాయం లేక : యానాం పట్టణానికి 14 కి.మీ దూరంలో 18 ఎకరాల విస్తీర్ణంలో ‘యానాం ఒబిలిస్క్ టవర్’ను నిర్మించారు. కాకినాడ, కోనసీమ జిల్లాలకు మధ్యలో ఉన్న ఈ టవర్ వద్దకు పర్యాటకులు రావాలంటే సరైన రవాణా సదుపాయాలు లేవు. తాళ్లరేవులోని కోరంగి పర్యాటక ప్రాంతానికి వచ్చేవారు ఇక్కడికి రావాలంటే ప్రత్యేకంగా ప్రైవేటు వాహనాలు అద్దెకు తీసుకోవాలి. టవర్‌లో 21.60 మీటర్ల ఎత్తులో రెస్టారెంటు, 36.50 మీటర్ల ఎత్తులో వీక్షకుల గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సందర్శకులు పైకి వెళ్లడానికి లిఫ్టు ఉన్నా పనిచేయడం లేదు. మెట్ల మార్గంలో ఆయాసపడుతూ వెళ్లలేక వృద్ధులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఆసక్తి చూపడం లేదు. అక్కడ కనీసం నీటి వసతి, విశ్రాంతి సౌకర్యం లేవు.
అధికారుల తప్పిదాలు - పోలవరం నిర్వాసితుల జీవితాల్లో తొలగని కష్టాలు - POLAVARAM COMPENSATION problems
అనుసంధానం చేస్తే : కాకినాడ, ఉప్పాడ సాగర తీరం చక్కదిద్ది, హోప్ ఐలాండ్ (Hope Island) సందర్శనను పునరుద్ధరించి, ఆయా ప్రాజెక్టులను కోరింగకు అనుసంధానం చేయాలి. అక్కడి నుంచి పర్యాటకులు యానాంలోని గోదావరి తీరం, ఒబిలిస్క్ టవర్, దరియాలతిప్ప ఐలాండ్, మడ అటవీ ప్రాంతం, బొటానికల్ గార్డెన్ సందర్శించేలా చర్యలు తీసుకోవాలి. అందుకు తగ్గ ప్యాకేజీలు, రవాణా వ్యవస్థ, విశ్రాంతి గదులు ఏర్పాటుచేస్తే పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఏపీ పర్యాటక శాఖతో పుదుచ్చేరి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగితే పర్యాటక రంగానికి ఆదరణ పెరిగే అవకాశం ఉంది.
- ప్రాజెక్టు: యానాం ఒబిలిస్క్ టవర్
- నిర్మాణ వ్యయం: రూ. 26 కోట్లు
- విస్తీర్ణం: 18 ఎకరాలు
- ఎత్తు: 101.6 మీటర్లు
- బరువు: 9,125 టన్నులు
- సామర్థ్యం: గంటకు 216 కి.మీ వేగంతో గాలులు వచ్చినా తట్టుకునేలా నిర్మించారు.