Government Hostel Problems In Nizamabad : పేద, మధ్యతరగతి వర్గాలకు వరం ప్రభుత్వ వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం, అవసరం. గతంలో హాస్టల్స్‌లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వారధిగా నిలవాల్సిన హాస్టళ్లు ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిరుపేద విద్యార్థులు సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అరకొర సౌకర్యాలతో ఉండలేక ఇంటికి పోలేక నానా అవస్థలు పడుతున్నారు.
కనీస సదుపాయాలు లేక : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 86 ఎస్సీ, ఎ,స్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో 8వేల 915 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ఏళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే వసతి గృహాలు కొనసాగిస్తున్నారు. సరిపడా మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపుగా అన్ని వసతి గృహాలలో పడక మంచాలు లేక విద్యార్థులు నేలపైనే కునుకు తీయాల్సి వస్తుంది.
"వర్షాకాలం వచ్చిందంటే వ్యాధులు వ్యాపిస్తుంటాయి. మా చుట్టుపక్కల పదిహేను రోజులకి ఒకసారి దోమల మందు కొట్టిస్తే బాగుంటుంది. ఎన్నో సంవత్సరాలుగా బిల్డింగ్ ఇలానే ఉంది. ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. వర్షాలు కురుస్తాయి, రాత్రిళ్లు దోమలు కుడుతున్నాయి. కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వం ఇప్పటికైన పట్టించుకుని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం." - విద్యార్థులు
బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి : కొన్ని హాస్టళ్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు వసతి గృహాలకు ప్రహరీలు, కంచె లేకపోవడం వల్ల పందులు, కుక్కలు పరిసరాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. జిల్లాలోని నవీపేట, బోధన్, ఆర్మూర్ వసతి గృహాల్లో అయితే వర్షాకాలంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గదుల్లో ఉండాల్సిన పరిస్థితి.
వానాకాలం కావడంతో వసతి గృహాల్లో పారిశుద్ధ్య లోపంతో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశముంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలపై దృష్టిసారించి సమస్యలను పరిష్కరించాలని పలు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా పాలనాధికారులు వసతి గృహాలను తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.
రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థినులు - వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్