Govt Orders Increasing Scope of AP CRDA : రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడదీసిన ప్రాంతాలను తిరిగి సీఆర్‌డీఏలో విలీనం చేస్తూ పరిధిని పునరుద్ధరించింది. దీంతో సీఆర్‌డీఏ విస్తీర్ణం గతంలో ఉన్న మాదిరిగా 8 వేల 352 చదరపు కిలో మీటర్లకు పెరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో రాజధాని ప్రాంతంతో పాటు సమీప జిల్లాల సమగ్ర అభివృద్ధి చెందనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమరావతిపై కక్ష - సీఆర్‌డీఏ నుంచి తొలగింపు : ప్రజా రాజధాని అమరావతి అంతమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీకావు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాడటమేగాక. అమరావతి కార్పొరేషన్, మున్సిపాలిటీ అంటూ రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరకు రాజధాని బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేలా కొన్ని గ్రామాలను మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. సీఆర్డీఏ పరిధిని సైతం కుదించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 8వేల 352 కిలోమీటర్ల మేర సీఆర్డీఏ విస్తరించి ఉండగా అమరావతిపై కక్షతో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాన్ని సీఆర్‌డీఏ నుంచి తొలగించి బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో కలిపారు.
ఏపీ సీఆర్‌డీఏ పరిధి పెంపు - 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు
అలాగే పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో విలీనం చేశారు. తద్వారా రాజధానితో పాటు సమీప ప్రాంతాల సమగ్రాభివృద్ధిని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దుతూ సీఆర్‌డీఏ పరిధిని గతంలో ఉన్న మాదిరిగా పునరుద్ధరించింది. రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలు గ్రోత్ కారిడార్లుగా ఎదిగేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భూముల సేకరణకు వెసులుబాటు : సత్తెనపల్లి మున్సిపాలిటీతో పాటు గ్రామీణ మండలం, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, యడ్లపాడు మండలాల్లోని 92 గ్రామాల పరిధిలోని మొత్తం 1,069.55 చదరపు కిలోమీటర్లు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థలో కలిసింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలో ఉన్న 62 గ్రామాలు సైతం సీఆర్‌డీఏలో చేర్చారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ వంటి కీలక ప్రాజెక్ట్‌లు వాస్తవరూపం దాల్చితే అలైన్‌మెంట్‌లో ఇబ్బందులు తప్పుతాయి. భూముల సేకరణకు వెసులుబాటు ఉంటుంది. కూటమి ప్రభుత్వం నిర్ణయం వల్ల నిజాంపట్నం, మచిలిపట్నం పోర్టుతో రాజధాని అనుసంధానానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సీఆర్‌డీఏలో రాజధాని సమీప ప్రాంతాలు విలీనం కావడాన్ని ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు. అభివృద్ధి కేవలం రాజధాని ప్రాంతానికే పరిమితం కాకుండా చుట్టు పక్కల ప్రాంతాలకూ విస్తరించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
అమరావతి నిధులపై కీలక పరిణామం- సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా
మూడేళ్లలో అమరావతి సిద్ధం - డిసెంబర్లోగా టెండర్లు పూర్తి - క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ