Government Employees Received Salaries on 1st May in AP : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన జగన్ ప్రభుత్వం పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో సీఎం జగన్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. వారిని బుజ్జగించడానికే ఇప్పటికే సరెండర్ లీవ్‌ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం తాజాగా ఒకటో తేదీనే జీతాలివ్వడం లాంటి తాయిలాలతో ఉద్యోగులకు ఎరవేస్తోంది.
Employees Shock : ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బుధవారం ఉదయం నుంచే సెల్‌ఫోన్‌కి వస్తున్న మెసేజ్‌లు చూసి ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కాసేపటికి తేరుకుని ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తుతెచ్చుకుని స్థిమితపడ్డారు. ప్రతి నెలా ఏ ఐదారు తేదీల్లోనో కొన్ని నెలల్లో పన్నెండు, పదమూడో తేదీల్లోనూ జీతాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు ఒకటో తేదీనే జీతాలు వచ్చేసరికి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయారు. ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌ల బకాయిలను ఇటీవలే విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్‌లో ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు వేసి ప్రభుత్వం మరో షాకిచ్చింది. మే1న కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఐనప్పటికీ జీతాలు చెల్లించడంపై ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు.
అరకొర జీతం, అదీ మూడు నెలలకు గానీ రాదు - ఆర్బీకే ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు
ప్రతి నెలా పోరాటమే : గతంలో ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం ఉద్యమాలు, డిమాండ్లు చేసేవారు. కానీ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు వంటి సీరియస్ అంశాలతో పాటు ప్రతి నెలా జీతాల కోసం కూడా పోరాడాల్సి వచ్చింది. అంతకుముందు రెండు మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని విచిత్రమైన పరిస్థితుల్ని జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు చూశారు. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీ గడిచిన తరువాతే జీతాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ ఉద్యోగులు వారు కట్టాల్సిన వాయిదాలు, ఖర్చులనూ వేతాలను తగ్గట్లుగా ప్లాన్ చేసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో జీతం ఇవ్వాలని ఉద్యోగులు, పింఛనుదారులు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఒక దశలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు అప్పటి గవర్నర్‌ను కలిసి ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారంటేనే ప్రభుత్వం వారిని ఏ స్థాయిలో వేధించిందో అర్థమవుతుంది. ప్రతి నెలా ప్రభుత్వానికి అప్పు దొరికితేనే తమకు జీతాలిస్తుందన్న నమ్మకం ఉద్యోగుల్లో స్థిరపడిపోయింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడం సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటిగా ఉండేది.
భయమే ఇవన్నీ చేయిస్తోందా? : ఐదేళ్లుగా సీఎం జగన్, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని పూచికపుల్లలా తీసిపారేశారు. వారి సమస్యలు, డిమాండ్లు పట్టవన్నట్లు వ్యవహరించారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లనూ ఎగతాళి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పూ ఉండాలని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. నిధుల్ని ప్రజలకు పంచాలా లేక ఉద్యోగులకు ఇవ్వాలా? అంటూ మరో మంత్రి వారికి అంత ప్రాధాన్యం కాదన్నట్లు మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలెన్నో ఎదురయ్యాయి.
ప్రభుత్వ బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకోని ప్రభుత్వం నాలుగైదు రోజుల క్రితం హఠాత్తుగా కొన్ని విభాగాల ఉద్యోగులకు సరెండర్ లీవ్‌ల బకాయిల్ని చెల్లించింది. ఒక్కొక్కరి ఖాతాలో 50 వేల నుంచి లక్ష వరకు జమ చేసింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా ఒకటో తేదీనే జీతం వేసేసింది. బుధవారం ఉదయం 8.30 నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడటం మొదలైనట్టు తెలిసింది. సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు తమకు మధ్యాహ్నం వరకు జీతం పడలేదని ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో వారికీ హుటాహుటిన వేసేసినట్లు తెలిసింది. జగన్ సర్కార్ ఉద్యోగులకు ఇంకా పీఆర్సీ, డీఏ, టీఏ, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు, సీపీఎస్ ఉద్యోగులకు పాన్ ఖాతాలకు జమచేయాల్సిన బకాయిలు కలిపి సుమారు రూ. 17 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. అది తమవల్ల కాదని చేతులెత్తేసిన ప్రభుత్వం ఈ నెలలోనైనా జీతాలు ఒకటో తేదీన ఇచ్చి ఉద్యోగుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.