Government Decided Price to Tomato : కర్నూలు- పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా ధరలపై ప్రభుత్వం స్పందించింది. రైతుల నుంచి మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు చేసేలా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కిలో రూ.8/- చొప్పున కొనుగోలు చేసి అదే ధరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో విక్రయాలు చేయాలని సూచనలు జారీ చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి టమాట దిగుమతి , అదే సమయంలో తక్కువ ధరకే వర్షాధార టమాటా మార్కెట్లోకి రావటంతో ధరలపై ప్రబావం పడినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా వినియోగదారులకు భారం పడకుండా కొనుగోళ్లు విక్రయాలు చేపట్టాల్సిందిగా మార్కెటింగ్ శాఖను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈమేరకు రైతు బజార్లలో విక్రయాలు చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖకు సూచనలు జారీ చేశారు.
కిలో టమాట రూపాయి కంటే తక్కువా? - రహదారిపై రైతుల ఆందోళన
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో గురువారం టమాటా రైతులు ఆందోళనకు దిగారు. ధరలు గురువారం ఒక్కసారిగా పడిపోయాయి. వ్యాపారులు కిలో టమాటా రూపాయి, అంతకంటే తక్కువ ధర చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. ఉత్తపుణ్యానికి అమ్ముకోలేమంటూ మార్కెట్ యార్డులోనే నేలపై పారబోశారు. సమీపంలోని పత్తికొండ- గుత్తి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు.
మంచి నాణ్యత ఉన్న సరకుకు కూడా వ్యాపారులు ధర పెట్టడం లేదని, తక్కువకు వేలం పాడుతున్నారని రైతులు మండిపడ్డారు. దీనిపై మార్కెట్ యార్డు కార్యదర్శి కార్నోలీస్ మాట్లాడుతూ ‘వారం రోజులుగా టమాటా ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, పూర్తిగా పడిపోలేదు. ఈ రోజు నాణ్యతలేని సరకును మాత్రమే వ్యాపారులు తక్కువ ధరకు అడిగారు. తోటల్లో సాగు చేసిన టమాటా క్వింటాలు ధర రూ.1,800 వరకు పలికింది. మెట్ట భూముల్లో సాగు చేసిన పంట నాణ్యత దెబ్బతింటోందని వివరించారు.
పండుగ వేళ పస్తులేనా? సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు