Government Action Plan Ready For Road Repair : రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసిన ఫలితంగా నేడు ఎక్కడ చూసినా గుంతలు పడ్డ, దెబ్బతిన్నరోడ్లే కన్పిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి వీటి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది. యుద్ధప్రాతిపదికన గుంతలు పూడ్చే పనులు చేపట్టి, వాహనదారులకు తొలుత కొంత ఉపశమనం కలిగిస్తోంది.
దీర్ఘకాలిక లక్ష్యంతో రోడ్ల విస్తరణ, వంతెనలు, కల్వర్టులు తదితరాల నిర్మాణంపై వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన ప్రణాళికను సిద్ధం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2029-30 వరకు ఐదేళ్లలో 40,178 కి.మీ. మేర రోడ్లను గాడిలో పెట్టాలని, ఇందుకు రూ.43,173 కోట్ల వ్యయమవుతుందని ఇంజినీర్లు అంచనాలు రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవలే ఈ నివేదికను అందజేశారు.
విస్తరణ, పునరుద్ధరణకే అధిక నిధులు
- సాధారణంగా రోడ్లు నిర్మించాక ఐదేళ్లకోసారి వాటిని పునరుద్ధరించాలి. పై పొరను తొలగించి, కొత్త పొర వేయాలి. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఒకే ఒక్క ఏడాది, అదీ కొన్ని రోడ్లను మాత్రమే పునరుద్ధరించారు. వచ్చే ఐదేళ్లలో 21,743 కి.మీల మేర పునరుద్ధరణ పనులు చేయాలని, ఇందుకు రూ.12,805 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు.
- ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణకు కూడా గత ప్రభుత్వం పెద్దగా నిధులు ఇవ్వలేదు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) వంటివి రుణాలు ఇచ్చినా వాడుకోలేదు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే 8 వేల కి.మీ.ల మేర రోడ్లను విస్తరించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రాష్ట్ర రహదారులు రూ.2,500 కి.మీ.కాగా, జిల్లా రహదారులు 5,500 కి.మీ. మేర ఉన్నాయి. వీటి విస్తరణకు రూ.14,045 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు.
- ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట కాల్వల వెంబడి ఉండే రోడ్లు, అధిక లోడుతో వాహనాలు వెళ్లే రోడ్లు త్వరగా దెబ్బతింటాయి. వాటిని ఎప్పటికప్పుడు పటిష్ఠ పరచాల్సి ఉంది. ఇందుకోసం ఐదేళ్లలో రూ.8,196 కోట్లు వెచ్చించి, 9,375 కి.మీ. మేర కాల్వల వెంబడి రోడ్లను పటిష్ఠ పరచాలని నివేదికలో పేర్కొన్నారు.
విజయవాడ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ - పెండింగ్ పనుల పరిష్కారానికి చర్యలు
- 2,640 చోట్ల శిథిలమైన వంతెనలు, కల్వర్టులను గుర్తించారు. వీటిని పటిష్ఠ పరచడం లేదా కొత్తవి నిర్మించడానికి ఐదేళ్లలో రూ.5,460 కోట్లు అవసరమని అంచనా వేశారు.
- జిల్లా రహదారుల్లో మట్టితో ఉన్నవాటిని తారు రోడ్లుగా మార్చేందుకు, గ్రామాల పరిధిలో ఉండే తారు రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చడంపై దృష్టి సారించారు. రూ.1,209 కోట్లు వెచ్చించి 958 కి.మీ. మేర మార్చాల్సి ఉంటుందని నివేదించారు.
- అసలు రోడ్లు లేనిచోట్ల కొత్తగా 102 రహదారుల నిర్మాణానికి రూ.823 కోట్ల వ్యయం కానుంది.
- ప్రమాదకర మలుపులు సరిచేయడం, కూడళ్లు, బడులు, కళాశాలల వద్ద స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం, హెచ్చరికల బోర్డుల ఏర్పాటు వంటి రహదారి భద్రత పనులకు రూ.635 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు.
పీపీపీ రోడ్లకు ప్రభుత్వ వాటా : రాష్ట్ర రహదారులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గుత్తేదారులు రోడ్లు అభివృద్ధి చేశాక కొంత టోల్ వసూలు చేస్తారు. టోల్ రుసుములు సరిపోని పక్షంలో, మిగిలిన మొత్తాన్ని వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద ప్రభుత్వమే చెల్లించడంపై యోచిస్తోంది. రోడ్ల విస్తరణలో భాగంగా భూసేకరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించాలి. మొదటి విడతగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే 1,300 కి.మీ. రోడ్ల విస్తరణకు ఏడాదికి రూ.500 కోట్లు చొప్పున, మూడేళ్లలో రూ.1,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
వర్షాలకు దెబ్బతినే రోడ్లలో ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు ఐదేళ్లలో రూ.1,506 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 2025-26లో రూ.395 కోట్లు, అత్యల్పంగా 2029-30లో రూ.241 కోట్లుగా నివేదికలో పేర్కొన్నారు.
PPP పద్ధతిలో రోడ్ల నిర్మాణం - రెండు విడతల్లో 20 రహదారులకు మోక్షం